సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్యపై పునర్విచారణను వ్యతిరేకిస్తూ ఆయన మునిమనవడు తుషార్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకుడిగా ఉన్న అమరేందర్ శరణ్ నివేదిక అందించేందుకు గడువు కోరారు. గాంధీ హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ పంకజ్ ఫడ్నవిస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై అక్టోబర్ 6న విచారించిన న్యాయస్థానం విచారణకు సాయం చేయాలని కోరుతూ మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. అయితే ఈ కేసులో పంకజ్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తుషార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో జోక్యం చేసుకునే హక్కు పంకజ్‌కు లేదని పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ‘అయితే గాంధీ హత్య కేసులో జోక్యం చేసుకునే హక్కు తుషార్‌కు ఉందా ?’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం గాంధీ హత్య కేసులో అనేక అనుమానాలు తలెత్తాయని.. అమికస్ క్యూరీ నివేదిక వచ్చేంత వరకు తుషార్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment