మహాత్మాగాంధీ హత్య జరిగి 69 ఏళ్లవుతోంది. కేసును తిరిగి దర్యాప్తు చేయాలనే పిటిషన్ విచారణార్హతపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. విచారణపడి శిక్షలు అమలయ్యాక... సుదీర్ఘకాలం గడిచాక ఇప్పుడీ కేసులో విచారించేందుకు ఏముందని తొలుత అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం... చివరకు పిటిషనర్ సమర్పిస్తున్న ఆధారాలను పరిశీలించి కోర్టుకు సహాయకారిగా (అమికస్‌క్యూరీ) ఉండాల్సిందిగా సీనియర్ న్యాయవాది అమరేంద్ర శరణ్‌ను కోరింది. తదుపరి విచారణను అక్టోబరు 30కి వాయిదా వేసింది. పిటిషనర్ సుప్రీంకోర్టులో లేవనెత్తిన అంశాలేమిటో చూద్దాం...
1. మహాత్మునిపై నాథూరామ్ గాడ్సేతో పాటు మరోవ్యక్తి కూడా కాల్పులు జరిపి ఉండొచ్చు.
2. బాపూజీ ఛాతిలో మూడు బుల్లెట్లు దిగాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కాని నాలుగో బుల్లెట్ దిగింది. ఇదే ఆయన ప్రాణం తీసింది. (గాంధీ కుటుంబసభ్యుల కోరిక మేరకు ఆయన పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. కాబట్టి దీన్ని నిరూపించే ఆస్కారమే లేదు).
3. మహాత్ముని హత్యలో బ్రిటన్ గూఢచార సంస్థ ‘ఫోర్స్ 136’ ప్రమేయముంది. నా దగ్గరున్న ఆధారాలు దీన్నే సూచిస్తున్నాయి.
4. గాంధీ హత్య కేసులో దోషిగా తేలి గాడ్సేతో పాటు ఉరితీయబడిన నారాయణ్ ఆప్టే ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశాడని జస్టిస్ జేఎల్ కపూర్ కమిషన్ 1969లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రక్షణశాఖ మాత్రం ఆప్టే ఎప్పుడూ వైమానిక దళంలో పనిచేయలేదని స్పష్టం చేసింది. అంటే... ఆప్టే ఫోర్స్ 136కు పనిచేసి ఉండొచ్చు. తమ గూఢచారుల రికార్డులను ధ్వంసం చేయడం ఫోర్స్ 136 ఒక విధానంగా పెట్టుకుంది. కాబట్టే ఆప్టే సర్వీసు రికార్డులు లేకుండా పోయాయి. సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా పనిచేసిన విజయలక్ష్మి పండిట్‌కు 1948 ఫిబ్రవరిలోనే గాంధీ హత్యకు బ్రిటన్ ప్రయత్నిస్తోందనే సమాచారం అందిందనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి బ్రిటన్ ప్రమేయంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరముంది.
5. గాంధీపై కాల్పులు జరిగినపుడు... అమెరికా రాయబార కార్యాలయంలో పనిచేసే హెర్బర్ట్ టామ్ రీయినర్ ఆయనకు అయిదు అడుగుల దూరంలోనే ఉన్నారు. భారత గార్డుల సహాయంతో గాడ్సేను పట్టుకున్నారు. అదే రోజు (1948 జనవరి 30) జరిగిన సంఘటనను ఆయన తోటి ఉద్యోగులతో పంచుకున్నారు. అమెరికా హోం డిపార్ట్‌మెంట్‌కు ఈ వివరాలను టెలిగ్రామ్ చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో ఆయన సంఘటనా స్థలంలో ఉన్నారనే ప్రస్తావనే లేదు. హెర్బర్ట్ రీయినర్... గాడ్సేను పట్టుకున్నారని అమెరికా రికార్డులు చెబుతున్నాయి. రీయినర్ వాంగ్మూలం, ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి జనవరి 30న వెళ్లిన టెలిగ్రామ్‌ను అగ్రరాజ్యం ఇప్పటికీ క్లాసిఫైడ్ (అధికారిక రహస్య సమాచారం)గానే ఉంచింది. జాతీయ భద్రత రీత్యా వీటిని వెల్లడించలేమంటోంది. ఒక భారతీయుడిని మరో భారతీయుడు హత్య చేస్తే... 70 ఏళ్లు గడిచాక కూడా అది అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన అంశమెలా అవుతుంది?
6. మహాత్ముని సోదరుడి మనవరాలైన మనూబెన్ గాంధీ ఆయనకు సహాయకురాలిగా ఉన్నారు. గాడ్సే కాల్పులు జరిపినపుడు ఆమె మహాత్ముడి పక్కనే ఉన్నారు. ప్రత్యక్షసాక్షి అయినప్పటికీ ప్రభుత్వ న్యాయవాదులు ఆమెను ఎప్పుడూ కోర్టుకు పిలువలేదు. దీన్ని జేఎల్ కపూర్ కమిషన్ ధృవీకరించింది.
7. ట్రయల్ కోర్టు దోషులుగా తేల్చిన తర్వాత గాడ్సే, ఆప్టే తదితరులు తూర్పు పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కిందికోర్టు విధించిన శిక్షలనే ఖరారు చేసింది. ప్రైవీ కౌన్సిల్‌కు అప్పీలు చేస్తే... 1950 జనవరి నుంచి భారత సుప్రీంకోర్టు ఉనికిలోకి వస్తుందని చెప్పి ప్రైవీ కౌన్సిల్ (బ్రిటన్ అప్పీలేట్ అథారిటీ) వీరి పిటిషన్‌ను వెనక్కిపంపింది. 1949 నవంబరు 15న గాడ్సే, ఆప్టేలను ఉరితీశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో గాంధీ హత్యపై ఏనాడూ విచారణ జరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తిరిగి దర్యాప్తు చేయాలనే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలి.
ధర్మాసనం ఏమంది?
పిటిషనర్ చెబుతున్న ఆ మూడో వ్యక్తి సజీవంగా ఉన్నారా? ఒకవేళ మరణించి ఉంటే విచారణను ఎదుర్కొనలేడు కదా. బ్రిటన్ గూఢచర్య సంస్థ ప్రమేయం అంటున్నారు. సంస్థను శిక్షించలేం కదా? అలాగే అమెరికా రాయబార కార్యాలయ ఉద్యోగి రీయినర్ కూడా ఇటీవలే చనిపోయారని మీరు చెబుతున్నారు.
కోర్టుల్లో నిరూపణ అయిన దానిపై మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పునర్ దర్యాప్తు అవసరమా? గాంధీ హత్యకు కుట్రపై విచారణ జరిపేందుకు నలభై ఏళ్ల కింద వేసిన జేఎల్ కపూర్ కమిషన్ కూడా కొత్తగా చెప్పడానికేమీ లేదని తేల్చిచెప్పింది కదా. తిరిగి దర్యాప్తునకు ఆదేశించడం సబబేనా, న్యాయపరంగా సాధ్యమేనా? అని జస్టిస్ ఎస్.ఎ.బోడే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
వాస్తవాలను వెలుగులోకి తేవడానికి విచారణ అవసరమే, ఇప్పుడు కోర్టు ముందుంచిన ఆధారాలతో పాటు కొంత సమయమిస్తే మరిన్ని ఆధారాలు సమర్పిస్తానని పిటిషనర్ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్ సమర్పించే ఆధారాలను పరిశీలించాలని, పునర్ దర్యాప్తునకు ఆదేశించడం సాధ్యమేనా, న్యాయపరంగా ఆ ఆస్కారం ఉందా? అనే కోణాల్లో కోర్టుకు స్పష్టతనిచ్చి సహకరించాలని నరేంద్ర శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించి... నాలుగువారాల గడువిచ్చింది.
ఎవరీ పిటిషనర్...
డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ముంబైకి చెందిన అభినవ భారత్ ట్రస్టులో ట్రస్టీ. హిందూ అతివాద భావాలున్న సంస్థ ఇది. మలేగావ్ పేలుళ్ల కేసుతో పాటు ముస్లింపై జరిగిన పలు దాడుల కేసుల్లో అభినవ భారత్ కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. గాంధీ హత్యపై గడిచిన 20 ఏళ్లుగా ఫడ్నిస్ పరిశోధన చేస్తున్నారు.
శిక్ష పడింది వీరికే
1948 జనవరి 30 ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీ ప్రార్థనకు వెళుతుండగా సాయంత్రం 5.12 గంటలకు నాథూరామ్ గాడ్సే మహాత్ముడిని అడ్డగించి అతిసమీపం నుంచి చాతిలో మూడుసార్లు కాల్చాడు. గాడ్సేను పోలీసులు సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నిమిషాల్లోనే గాంధీ ప్రాణాలు విడిచారు. గాంధీ హత్య, కుట్ర కేసులో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు.
వీరిలో నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు ట్రయల్‌కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు...దిగంబర్ బాడ్గే, శంకర్ కిష్టయ్య, దత్రాత్రేయ పర్చురే, విష్ణు కర్కరే, మదన్‌లాల్ పహ్వా, గోపాల్ గాడ్సే (నాథూరామ్ సోదరుడు)లకు జీవితఖైదు పడింది. హత్యకు కుట్రలో పాల్గొన్నారనేందుకు సరైన ఆధారాలు లేని కారణంగా హిందూ మహాసభ నేత వినాయక్ దామోదర్ సావర్కర్‌ను నిర్దోషిగా కోర్టు తేల్చింది.
అయితే జస్టిస్ జే.ఎల్.కపూర్ కమిషన్ మాత్రం తమ నివేదిక ముక్తాయింపులో ఇలా పేర్కొన్నారు... ‘‘ఆధారాలు, వాంగ్మూలాలను పరిశీలించిన పిదప... సావర్కర్, అతని గ్రూపు గాంధీ హత్యకు కుట్ర పన్నాయనేది తప్పితే మరో వాదనకు ఆస్కారం కనపడటం లేదు’.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment