సాక్షి, న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు సోమవారం పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. వాటికి సంబంధించి వాదనల అనంతరం బెంచ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్-సిమ్‌కార్డు లింక్‌తోపాటు గాంధీ హత్య కేసు పునర్విచారణ, కేరళ లవ్ జిహాదీ కేసు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ ప్రివిలేజ్ లను కల్పించే రాజ్యాంగంలోని 35 (ఏ) ఆర్టికల్.. తదితర కీలక అంశాలు అందులో ఉన్నాయి.
గాంధీ హత్య కేసు పునర్విచారణ... నాలుగో బుల్లెట్ అంశం తెర మీదకు రావటంతో కేసు పునర్విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం స్పందించింది. దీనిపై అమికస్ క్యూరీగా నియమించబడిన అమరిందర్ శరన్ మరింత సమయం కావాలని కోరటంతో నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఇరు వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం సేకరించి.. అసలు ఈ పిటిషన్ న్యాయపరమైనదేనా అని తేల్చాల్సిందిగా అమరిందర్‌ను కోర్టు కోరింది.
గాడ్సే తుపాకీ నుంచి బుల్లెట్ల నుంచి కాకుండా మరో బుల్లెట్‌తోనే ఆయన వదిలారంటూ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా.. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మాత్రం అదంతా ఉత్తదేనని వాదిస్తున్నారు. ఆ అభ్యర్థన అర్థరహితమని తోసిపుచ్చుతున్నారు.
ఆధార్-మొబైల్ నంబర్ అనుసంధానం... మొబైల్ నెంబర్‌కు ఆధార్ అనుసంధామనే తప్పనిసరి నిర్ణయాన్ని తప్పుబడుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. కేంద్రంతోపాటు టెలికాం సంస్థలకు కూడా ఈ నోటీసులు అయ్యాయి.
అంతకు ముందు విచారణ ప్రారంభ సమయంలో వ్యక్తిగతంగా పిటిషన్ దాఖలు చేయాలని మమతను న్యాయమూర్తి కోరారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ప్రశ్నించే హక్కు రాష్ట్రానికి ఉంటుందా? అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రేపు రాష్ట్రాల ఉత్తర్వులపై కేంద్ర ప్రశ్నించే వీలుండా అంటూ చురకలు అంటించింది. దీంతో ప్రభుత్వం మరో పిటిషన్ ఫైల్ చేయగా.. విచారణను కొనసాగించింది. చివరకు నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
కాగా, కనెక్షన్ తొలగించకుండా ఉండాలంటే అన్ని మొబైల్ ఫోన్లకు ఆధార్ కార్డు నెంబర్‌ను జత చేయాలంటూ గత మార్చిలో కేంద్రం ఓ నోటీసులో పేర్కొంది. కొత్త సిమ్స్ తీసుకోవాలన్నా ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిబంధనను మమతా బెనర్జీ ఇటీవలే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అంతకంటే తన ఫోన్ డిస్‌కనెక్ట్ చేసిినా తాను సిద్ధమేనని ఆమె ప్రకటించారు కూడా.
లవ్ జిహాద్ కేసు... వాదనలు విన్న బెంచ్ కోర్టు యువతి మేజర్ అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తండ్రి అశోకన్ కేఎం దగ్గర ఉన్న హదియా(అఖిల)ను వచ్చే నెల(నవంబర్) 27న కోర్టులో హాజరుపరచాలని కేరళ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. వీడియో ద్వారా విచారణ చేపట్టాలన్న అఖిల తండ్రి వాదనను ఈ సందర్భంగా కోర్టు తిరస్కరించింది.
- ఆధార్ అనుసంధానం వ్యవహారంపై విచారణకు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు. రాజ్యాంగ బద్ధత అంశంపై నవంబర్ చివరి వారంలో ధర్మాసనం విచారణ చేపట్టనుంది
- ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను గుజరాత్ ఎన్నికల పర్యవేక్ష కోసం నియమించ వద్దని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment