Tution fee
-
అసలు ట్యూషన్ ఫీజు అంటే..?
సాక్షి, హైదరాబాద్: లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్‌కు గతంలో వేర్వేరుగా ఫీజులను వసూలు చేసిన కార్పొ రేట్, బడా ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడు అన్నిం టినీ ట్యూషన్ ఫీజు కిందే వేస్తున్నాయి.. కరోనా కారణంగా ప్రజల జీవన పరిస్థితులు అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్స రంలో ట్యూషన్ ఫీజులు మాత్రమే, అదీ నెల వారీగా తీసుకోవాలని జీవో 46ను జారీ చేసింది. ఇదే ఆసరాగా తీసుకున్న ప్రైవేటు యాజ మాన్యా లు.. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇతరత్రా ఫీజు లను వేర్వేరుగా చూపించకుండా అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు కిందే వేసి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తు న్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన 3 నెలల ప్రత్యక్ష బోధన కోసం సంవత్సరం ఫీజును ఇలా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఆలోచనల్లో పడింది. అందుకే ట్యూషన్ ఫీజు అంటే ఏంటి? అం దులో ఏమేం వస్తాయన్నది తేల్చేందుకు సిద్ధ మైంది. ఫీజుల వసూలు విధాన మెలా ఉండాలి? ఫీజుల నియంత్రణ ఎలా చేపట్టా లన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాడైరెక్టర్ దేవసేన చర్చించారు. కొన్నేళ్లుగా డిమాండ్.. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రించాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన చేయడం, విద్యా శాఖ కొంత హడావుడి చేసి వదిలేయడం పరిపాటి అయింది. వీటికి తోడు న్యాయ వివాదాలతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2009 ఉమ్మడి రాష్ట్రం నుంచే ఫీజుల నియంత్రణకు అప్పటి సర్కార్ చర్యలు చేపట్టగా.. వివిధ దశల్లో కోర్టు తీర్పుల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటు తల్లిదండ్రులు, అటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకే అధిక సమయం పట్టింది. దీంతో 2017లోనే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేశాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరం వరకు సమావేశాలు, నివేదిక రూపకల్పనతోనే గడిచిపోయింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,725 వరకు ప్రైవేటు స్కూళ్లున్నాయి. వాటిల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకే 31 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారు కాకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు మరో 7–8 లక్షల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. అయితే వాటిల్లో ఫీజుల విధానం, వాటిపై నియంత్రణ అంటూ ఏమీ లేకుండాపోయింది. యాజమాన్యాలు నిర్ణయించిందే ఫీజు.. రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.3.5 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్న పాఠశాలలున్నాయి. 10 శాతం పెంపు అశాస్త్రీయం.. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు 2016–17లో ఉన్న ఫీజులపై ఏటా ఫీజులను 10 శాతం లోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసింది. ఇదే అసలు సమస్యగా మారింది. సదుపాయాలపై శాస్త్రీయ అంచనా లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. తాజాగా విద్యాశాఖ వాటిపై ఆలోచనలు మొదలుపెట్టింది. ఆ సిఫారసుల్లోని లోపాలను తొలగించడంతో పాటు పక్కాగా ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్ పరిసర జిల్లాల్లో డీఈవోలతోనూ కమిటీ వేసింది. ఫీజుల నియంత్రణకు ఎలాంటి విధానాలు అవసరమన్న దానిపై పక్కాగా, న్యాయ వివాదాలు తలెత్తకుండా ఎలా చర్యలు చేపట్టాలన్న దానిపై దృష్టి సారించింది. -
లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజుల తగ్గింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోన్న తెలంగాణ విద్యార్థిని ఆర్థిక సమస్యలతో చదువుని కొనసాగించలేక, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కళాశాల కొన్ని కోర్సులకు ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ల్యాప్‌టాప్‌లను అందించేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులను హాస్టళ్ళలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కళాశాల పేర్కొంది. కాలేజీలు మూసివేయడంతో విద్యార్థులు కళాశాల సౌకర్యాలను వినియోగించుకోలేకపోతుండడంతో ఈ యేడాది ఫీజులో ఆ చార్జీలను తగ్గిస్తూ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. (ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి..) దీంతో ఫీజు గణనీయంగా తగ్గనుంది. అలాగే మిగిలిన పీజు సైతం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని సైతం కళాశాల కల్పించింది. కోవిడ్ తగ్గిన తరువాత అవసరాన్ని బట్టి రెండు, మూడో యేడాది విద్యార్థులకు మరింత మందికి హాస్టల్ వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థుల హాస్టల్ సౌకర్యం పొడిగింపుని నిరోధించే కొన్ని వాక్యాలను సైతం దరఖాస్తు ఫారం నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల అధికారులు పేర్కొన్నారు. (చదువుల తల్లి బలవన్మరణం) -
స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!
బాలి: కరోనా వైరస్ అందరి జీవితాల్లో పేను మార్పులు తెచ్చింది. లాక్డౌన్ కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అన్ని రంగాలు ఎంతో దెబ్బతిన్నాయి. విద్యా రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. పాఠశాలలు, కాలేజీలు మూతపడటంతో ఎందరో ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే వారి బాధలు వర్ణణాతీతం. ఇదిలా ఉంటే పాఠశాలలు తెరిచినా.. పిల్లలను బడికి పంపలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందరో తల్లిదండ్రులు. తినడానికి తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న వారు ఇక వేలకు వేలు ఫీజులు చెల్లించి పాఠశాలలకు పంపడం అంటే మాటలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తలల్లిదండ్రుల కష్టాలను గమనించిన ఓ హాస్పిటాలిటీ కళాశాల ఈ సమస్యకు ఆసక్తికరమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది. అది ఏంటంటే విద్యార్థులు ఫీజుకు బదులు కొబ్బరి బొండాలు ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ఎన్నో కుటుంబాలకు మేలు చేసింది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కాలేజీ మనదేశంలో లేదు. ఇది బాలిలో జరిగింది. బాలిలోని టెగలాలాంగ్లోని వీనస్ వన్ టూరిజం అకాడమీ తన విద్యార్థుల ట్యూషన్ ఫీజును నగదుకు బదులు కొబ్బరికాయల రూపంలో చెల్లించడానికి అనుమతించింది. ఆర్థిక మందగమనం, నష్టాల కారణంగా ఫీజు చెల్లించలేని కుటుంబాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎందరికో మేలు జరగడమే కాక విద్యార్థులలో వ్యవస్థాపకత స్ఫూర్తిని పొందుపరిచింది అంటున్నారు అకాడమీ సిబ్బంది. ఎలా అంటే వారు తీసుకువచ్చే కొబ్బరికాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ వయన్ పసేక్ ఆది పుత్రా మాట్లాడుతూ.. ‘కోవిడ్ వల్ల అందరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఫీజుల భారంతో విద్యార్థులు చదువుకు దూరమవ్వకూడదని ఈ విధానాన్ని తీసుకువచ్చాం. ఫీజు బదులు కొబ్బరి కాయలు ఇవ్వొచ్చు. విద్యార్థులు తీసుకువచ్చిన కొబ్బరి కాయలను ఉపయోగించి స్వచ్ఛమైన కొబ్బరి నూనెని ఉత్పత్తి చేస్తాం’ అని తెలిపారు. (చదవండి: పేదరికాన్ని అనుభవించా.. అందుకే) ఈ అకాడమీ కొబ్బరికాయలతో పాటు స్థానికంగా దొరికే మోరింగా, గోటు కోలా అనే ఔషధ మొక్కల ఆకులను కూడా ఫీజు కింద తీసుకుంటుంది. కొబ్బరి నూనె, ఈ ఔషధ మొక్కలను ఉపయోగించి హెర్బల్ సబ్బులను తయారు చేస్తామని అకాడమీ సిబ్బంది వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. -
11 నుంచి పాలీసెట్ ఫైనల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్–2018 తుదివిడత కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి tspolycet.nic.in వెబ్సైట్లో ప్రాసెసింగ్ ఫీజును ఈనెల 8 నుంచి 11లోపు చెల్లించాలని సూచించారు. 11వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన (గతంలో ధ్రువపత్రాలు పరిశీలించుకోని అభ్యర్థులు) ఉంటుందని పేర్కొన్నారు. 12వ తేదీ లోపు ఆప్షన్లు ఇవ్వాలని, 13వ తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 14, 15వ తేదీల్లో ట్యూషన్ ఫీజు చెల్లింపు, కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. సీట్లు వచ్చినప్పటికీ ఇతర కాలేజీల్లో సీట్ల కోసం వేచి చూసేవారు, ఇప్పటికీ సీట్లు రాని అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు tspolycet.nic.in వెబ్సైట్ చూడాలని సూచించారు. -
అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు విశ్వ విద్యాలయ పౌర సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం గడువును పొడిగించామని యూనివర్సిటీ అధికా రులు వెల్లడించారు. రెండు, మూడో సంవత్సరంలో చేరే విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపునకు కూడా గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగిం చినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.