టీవీలు పగిలాయి .. శవయాత్ర .. అంత్యక్రియలు
ఇస్లామాబాద్: ఒకసారి కాదు... వరుసగా రెండో సారి కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటిమి పాలవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు తట్టుకోలేక పోయారు. ఆగ్రహాంతో ఊగిపోయారు. వీళ్లేప్పుడు ఇంతే నంటూ చూస్తున్న టీవీలను ముక్కలు ముక్కలుగా పగలు కొట్టారు. బ్యాట్లు, వికేట్లు, బంతులు మూట కట్టి శనివారం నగర వీధుల్లో శవయాత్ర నిర్వహించారు. అనంతరం సదరు క్రీడా సామాగ్రి మొత్తానికి అంత్యక్రియలు నిర్వహించారు. మీరు క్రికెట్ ఆటకు స్వస్తి చెప్పి... జాతీయ క్రీడలు హకీ, ఫూట్ బాల్‌పై దృష్టి సారించండి అంటూ పాక్ క్రికెట్ జట్టుకు క్రీడాభిమానులు హితవు పలికారు.
ఇదంతా పాకిస్థాన్‌లోని ముల్తాన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో వెస్టిండీస్‌తో శనివారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. పాక్ 150 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 311 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 39 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. అలాగే గత ఆదివారం భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాక్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రజలు కారాలుమిరాయలు నూరుతున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెటర్లు నివాసాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.