ఐటీ ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లివే!
దేశీయ ఐటీ ఇండస్ట్రీ రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని టెక్ నిపుణలంటున్నారు. ఒకటి ఆటోమేషన్, మరొకటి కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ప్రవేశపెడుతున్న కఠినతర నిబంధనలు. ఈ రెండు ఐటీ ఇండస్ట్రీకి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఆటోమేషన్తో మిషన్ల వాడకం పెరిగి వేల కొద్దీ ఉద్యోగాలు ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశీయ ఐటీ కీలకమార్కెట్గా ఉన్న అమెరికాలో వీసా నిబంధనలు మార్చడం కూడా పెద్ద పెనుముప్పుగానే మారుతుందన్నారు. ఆటోమేషన్తో ధరలు తగ్గినప్పటికీ, చాలామంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
కానీ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఐటీకి వ్యయాలు పెరిగి, మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన నాస్కామ్ లీడర్షిప్ ఈవెంట్లో ఐటీ నిపుణులు ఈ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అయితే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మిషన్లతో భయపడాల్సి వస్తుందని పేర్కొంటూనే ఆటోమేషన్ మరింత క్రియేటివ్ ఉద్యోగాలకు నాంది పలుకుతుందన్నారు. పునరావృత ఉద్యోగాలను తీసివేసి, ఇంజనీర్లకు, డెవలపర్లకు మరింత క్రియేటివ్ రోల్స్‌కు సాయం చేస్తుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్ తెలిపారు. ట్రంప్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం కంటే ఆటోమేషన్ అత్యంత ప్రమాదకరమైందని మరో టాప్ ఐటీ సంస్థ జనరల్ మేనేజర్ చెప్పారు.