రెండు చోట్ల ఆగిన పెళ్లి
పెళ్లి కొడుకులు పారిపోవడమే కారణం
బెంగళూరు : రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన రెండు ఘటనలు గురువారం వెలుగు చూశాయి. స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మండ్యా జిల్లా శ్రీరంగపట్టణ తాలూక మరలేగాల గ్రామానికి చెందిన నవీన్‌కు మైసూరుకు చెందిన రాధిక (పేరు మార్చాం) తో డిసెంబర్1న పెళ్లి నిశ్చయమైంది. ఈ మేరకు జరిగిన నిశ్చితార్థం రోజు వరుడుకు రూ.లక్షల నగదు, వందగ్రాముల బంగారు ఆభరణాలు వరకట్నంగా అందించారు. అయితే పెళ్లికి ముందే నవీన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వరుడు తల్లి బయటికి పొక్కనీయలేదు. అయితే పెళ్లిరోజు మాత్రం తనకు కొడుకు గురించి తెలియది మాత్రం చెప్పారు. రెండు రోజులు వెదికిన తర్వాత ఎక్కడా పెళ్లికుమారుడి జాడ తెలియకపోవడంతో గురువారం నాడు మైసూరులోని కేఆర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవీన్‌తల్లి విజయలక్ష్మమ్మతో పాటు పెళ్లిని కుదిర్చిన (మ్యారేజ్ బ్రోకర్) కృష్ణప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరోపెళ్లికి సిద్ధపడుతూ!
గతంలో తనకు జరిగిన పెళ్లిని దాచి మరోపెళ్లికి సిద్ధపడి చివరి నిమిషంలో పెళ్లికొడుకు పారిపోయిన ఘటన బెంగళూరులో గురువారం జరిగింది. మూలతహా చెన్నైకు చెందిన భాస్కర్ అన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి బెంగళూరులోని ఇందిరానగర్‌కు చెందిన సత్య (పేరుమార్చాం) వివాహం జరగాల్సి ఉంది. ఈ మేరకు నగరంలోని రాజాజీనగర్‌లోని కదంబ హోటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే గురువారం ఉదయం నుంచి భాస్కర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషయమై స్థానిక మహాలక్ష్మీ పోలీస్‌స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, గతంలోనే భాస్కర్‌కు చెన్నైకు చెందిన యువతితో పెళ్లి జరిగిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.