Two teenagers
-
క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవిత ఖైదు
బీజింగ్: క్లాస్‌మేట్‌ను దారుణంగా చంపిన నేరానికి గాను ఇద్దరు టీనేజర్లకు చైనా న్యాయస్థానం కఠిన జైలు శిక్షలు విధించింది. వీరిలో ఒకరికి జీవిత ఖైదు, మరొకరికి 12 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో సాక్షిగా ఉన్న మరో టీనేజర్‌ను కరెక్షన్ సెంటర్‌కు పంపించింది. హెబీ ప్రావిన్స్‌లోని హండన్‌లో ఈ ఏడాది మార్చిలో చోటుచేసుకున్న ఈ ఘటన చైనాలో సంచలనం కలిగించింది. బాధితుడు, దోషుల వయస్సు 13 ఏళ్లు. అందుకే అధికారులు వీరిని క్లుప్తంగా ఇంటి పేర్లతో వెల్లడించారు. క్లాస్మేట్ వాంగ్‌ను కొంతకాలంగా ఝాంగ్, లి, మా అనే బాలురు వేధిస్తున్నారు. వాంగ్‌ను చంపాలని ఝాంగ్ పథకం వేశాడు. దాని ప్రకారం మార్చి 3న నగరం శివార్లలోని పాడుబడ్డ గ్రీన్ హౌస్‌కు అతడిని తీసుకెళ్లాడు. అనుకున్న ప్రకారం మిగతా ఇద్దరూ అక్కడికి వచ్చారు. వాంగ్‌ను ఝాంగ్ పారతో కొట్టడం మొదలుపెట్టగా అతడికి లి సహకరించాడు. ఇది చూడలేక మా అక్కడికి నుంచి వెళ్లిపోయాడు. దెబ్బలతో చనిపోయిన వాంగ్‌ను ఇద్దరూ కలిసి అక్కడున్న గుంతలో పూడ్చి వేశారు. మార్చి 10న పోలీసులు ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగుచూసింది. సోమవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇది చాలా హేయమైన, క్రూరమైన చర్యగా అభివరి్ణంచింది. నేరానికి ప్రధాన సూత్రధారి ఝాంగ్‌కు జీవిత ఖైదును, అతడికి సహకరించిన లి కి 12 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మూడో బాలుడు మా ను పరివర్తన విద్యాకేంద్రానికి పంపించాలని తీర్పు వెలువరించింది. అయితే, వీరిని ఈ నేరానికి పురిగొలి్పన అసలు కారణాలు మాత్రం తెలియరాలేదు. కోర్టు తీర్పుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. కఠిన శిక్షల భయం లేనందునే పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ నలుగురి తల్లిదండ్రులు నగరానికి పనుల నిమిత్తం వెళ్లిపోగా, అమ్మమ్మతాతల వద్ద ఉంటూ అల్లరిచిల్లరగా తిరగడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు. 2020 నాటి గణాంకాల ప్రకారం ఇలా ‘వదిలివేయబడిన బాలలు’దేశంలో 6.70 కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. -
యువతి కిడ్నాప్‌నకు యత్నం
- బైక్‌పై వెళ్తుండగా దూకి తప్పించుకున్న వైనం - చికిత్స తర్వాత అదృశ్యం పెద్దపల్లి: ఓ యువతికి ఓ యువకుడు ఫోన్లో పరిచయమయ్యాడు. ఫోన్లో నాలుగు రోజులుగా మాట్లాడుకుంటున్నారు. చివరకు ఆ యువకుడు ‘నువ్వు నాతో మాట్లాడుతున్నావని, మీ ఊరిలో ఈ విషయం అందరికి చెబుతానని’ బ్లాక్మెయిల్ చేసి యువతిని పెద్దపల్లికి రమ్మన్నాడు. ఆమె రావడంతో బైక్ ఎక్కించుకున్నాడు. వారిని మరో ఇద్దరు యువకులు వెంబడిస్తుండడం చూసి ఆ యువతి బైక్‌పై నుంచి దూకేసిన సంఘటన పెద్దపల్లిలో శుక్రవారం జరిగింది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన 18 ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్లో నాలుగురోజుల క్రితం పరిచయమయ్యాడు. నిత్యం ఫోన్లో సంభాషిస్తున్నారు. శుక్రవారం ఉదయం సాయికుమార్ మరోసారి యువతికి ఫోన్ చేసి పెద్దపల్లికి రమ్మని చెప్పాడు. లేదంటే తనతో ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు చేశానని, మీ ఊరిలో ప్రచారం చేస్తానని బెదిరించాడు. భయపడిన సదరు యువతి అక్క కొడుకుతో పెద్దపల్లికి వచ్చింది. అతణ్ని బస్టాండ్ వద్ద ఉంచి సాయికుమార్ బైక్ ఎక్కింది. బైక్ పై శాంతినగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న క్రమంలో సాయికుమార్ మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు వెంటాడుతున్న విషయాన్ని గమనించిన యువతి బైక్‌పై నుంచి దూకేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలుకాగా, యువకుడు పరారయ్యాడు. యువతి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకొని వెళ్లిపోయింది. తనకు సమాచారం తెలియగానే ఆస్పత్రికి కానిస్టేబుల్‌ను పంపించానని, ఆస్పత్రిలో ఎవరూ లేరని, ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఆర్కే బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు
విశాఖపట్నం: స్నేహితులతో కలిసి బీచ్‌లో స్నానం చేస్తున్న ఇద్దరు బాలురు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కంచెరపాలెం గ్రామానికి చెందిన ఆదిత్య(14), సంతోష్(14)లు స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్‌లో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగారు. ఇది గుర్తించిన స్థానికులు ఓ బాలుడిని కాపాడగా.. ఆదిత్య, సంతోష్ గల్లంతయ్యారు. వారికోసం స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. -
ఒకరికోసం మరొకరు ఆ ఇద్దరి కోసం ఊరు!
మానవత్వం కళ్ల ముందే రెండు ప్రాణాలు పోబోతున్నాయని తెలుసు. ఆ ప్రాంతానికి వె ళ్తే తమ ప్రాణం కూడా పోతుందనీ తెలుసు. చుట్టూ పరవళ్లు తొక్కుతున్న వరద! కళ్ల ముందే జలప్రళయ ఘోష. ఆఖరికి... శిక్షణ పొందిన ఎన్ఆర్డీఎఫ్ సిబ్బంది సైతం ప్రాణభయంతో ఒక్క అడుగు వెనక్కు వేశారు. వెనుక నుంచే తిరిగి వెళ్లిపోయారు. ఆ తరుణంలో ఎటువంటి శిక్షణ లేకుండా... వరదలో చిక్కుకున్న ఆ ఇద్దరు యువకులను రక్షించాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామయువకులు ముందడుగు వేశారు! ఇందుకు ఎంతటి తెగింపు కావాలి! ఎంతటి గుండె ధైర్యం కావాలి!! ఇవేవీ అవసరం లేదు. మానవత్వం ఉంటే చాలు. అసలేం జరిగింది? ఈ నెల 21 తేదీ అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా భారీవర్షాలు కురిసాయి. పల్నాడు ప్రాంతాలను అతి భారీవర్షాలు ముంచెత్తాయి. ఆ ప్రభావంతో చిలకలూరిపేట ప్రాంతంలోని వాగులు వంకలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహించాయి. 22వ తేదీ. ఉదయం 8.30 గం. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కుప్పగంజి వాగు ఒరవడి పెరిగింది. నిమిషాల వ్యవధిలోనే పంటపొలాలను ముంచేసింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంలో కుప్పగంజి వాగు సమీపంలో ఉన్న ఎత్తిపోతల పథకంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చేవూరి ఏడుకొండలు... భార్య సుబ్బాయమ్మ, కుమారుడు వెంకటేష్ (20), సోదరుడి కుమార్తె అయిన పదేళ్ల వనజతో కలసి అక్కడి నుంచి బయటకు రావటానికి ప్రయత్నించాడు. వాళ్లంతా లిఫ్ట్‌నుంచి బయటకు వచ్చే సమయానికి క్షణక్షణానికి వరదనీరు పెరిగిపోయింది. చూస్తుండగానే ఆ కుటుంబం వాగులో కొట్టుకుపోయింది. వెంకటేష్ కూడా వాగులో కొట్టుకుపోతూ తాడిచెట్టును అసరాగా పట్టుకోగలిగాడు. ఒడ్డున నిలబడి ఇదంతా గమనిస్తున్న వెంకటేష్ సమీప బంధువు పోలయ్య అత డిని రక్షించటానికి వాగులో దిగాడు. మధ్యాహ్నం 2.30 గంటలు చెట్టు దగ్గరికి చేరుకొని వెంకటేష్‌ను బయటకు తెచ్చేందుకు పోలయ్య విఫలయత్నం చేశాడు. వరద మరింతగా పెరగటంతో అతను కూడా అక్కడే చిక్కుకుపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా మీడియా ద్వారా ఈ వార్త ప్రసారమైంది. అధికారులు స్పందించి ఎన్ఆర్డీఎఫ్ బలగాలను పంపుతున్నట్లు ప్రకటించారు. సమయం గడుస్తోంది..! ఎన్ఆర్డీఎఫ్ ఇంకా అక్కడికి చేరుకోలేదు. వెంకటేష్, పోలయ్య ఆ చెట్టుదగ్గరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఒకవైపు మబ్బులు కమ్ముకోవటంతో చీకట్లు ముసురుకుంటున్నాయి. హెలీకాప్టర్ వస్తుందని, ఎన్ఆర్డీఎఫ్ బలగాలు వస్తున్నాయని చూసిన వారికి అసహనం పెరిగిపోతోంది. గంటల సేపు చెట్టును ఆసరా చేసుకొని ఉన్న ఆ ఇద్దరిలోనూ ప్రాణాలపై ఆశ సన్నగిల్లుతోంది. ఇదంతా గమనించిన చిలకలూరిపేట మండలం గోవిందపురానికి చెందిన 30 మంది యువకులు వారిని రక్షించటానికి ముందుకు కదిలారు. సాయంత్రం 3.30 గంటలు అధికారులు ఎంతగా వారించినా గోవిందపురం యువకులు వినిపించుకోలేదు. వారికి తెలుసు.. మరికొంత సమయం గడిస్తే పరిస్థితి చేజారుతుందని. ఆ ఇద్దరు యువకులను కాపాడే ప్రయత్నంలో చిన్న తేడా వచ్చినా తమ ప్రాణాలూ నీట మునుగుతాయనీ, తమ కుటుంబాలకు విషాదం మిగిలుస్తామని కూడా వారికి తెలుసు. అయితే ఇలాంటి సంశయాలకు వారు లోను కాలేదు. ఆ సమయంలో వారి లక్ష్యం ఒకటే. ఆపదలో ఉన్న ఆ ఇద్దరినీ కాపాడాలి. అంతే. ఒక్కసారిగా సమష్టిగా కదిలారు. సరిగ్గా అదే సమయంలో సుమారు నాలుగు గంటల సయయంలో హెలికాప్టర్ ఆ చెట్టుదగ్గర చిక్కుకున్న వారిద్దరినీ రక్షించటానికి వచ్చింది. కాని రెండు మూడుసార్లు పైపైన చక్కర్లు కొట్టి తమ వల్ల కాదంటూ వెనుదిరిగారు హెలికాప్టర్లో ఉన్నవారు. ఇక మిగిలిన ఏకైక అశ వాగులో దిగిన గోవిందపురం యువకులే. ఆ యువకులే ఎట్టకేలకు.. వేలాదిమంది గ్రామస్థులు ఉత్కంతతో ఎదురుచూస్తున్న సమయంలో వెంకటేష్‌ని, పోలయ్యను తాడు సహాయంతో రక్షించి బయటకు తెచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు పొడవునా నిలబడి ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు ఈ హీరోలకు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. రెండు ప్రాణాల కోసం వేలాది గుండెలు పరితపించాయి. ఈ సంఘటన మనసున్న ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తి. (విషాదం ఏమిటంటే గల్లంతైన సుబ్బాయమ్మ, వనజల మృతదేహాలు దొరికాయి కానీ, వెంకటేష్ తండ్రి ఏడుకొండలు మృతదేహం ఈ స్టోరీ రాసే సమయానికింకా లభ్యం కాలేదు). - పోతుకూచి లీలానంద్, సాక్షి, చిలకలూరిపేట -
బీడీ ఇవ్వలేదని చంపేశారు!
థానే: బీడీని కలసి తాగడానికి నిరాకరించిన ఓ టీనేజర్‌ను ఇద్దరు టీనేజర్లు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం మహారాష్ట్ర థానేలోని శాంతినగర్‌లో సోమవారం జరిగింది. అన్సారీ(17) పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్తుండగా 16 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు అడ్డుకుని అతడు తాగుతున్న బీడిని అడిగారు. బిలాల్ ఒప్పుకోకపోవడంతో అతణ్ని కొట్టి చంపారు. నిందితులను అరెస్టు చేసి హత్యాభియోగాలు మోపి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
కువైట్ కష్టం.. క్యాబ్‌డ్రైవర్ పాలు!
శంషాబాద్/బాన్సువాడ: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం సాయంత్రం కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు కాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయారు. వారిద్దరినీ ఆ డ్రైవర్ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖాలిద్, బోధన్‌కు చెందిన నసీర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వీరు.. ఎంజీబీఎస్ వెళ్లేందుకు ఓ క్యాబ్‌లో ఎక్కి కూర్చున్నారు. వీరు రూ. లక్షల విలువచేసే స్మార్ట్ఫోన్లు, ఎల క్ట్రానిక్ సామాగ్రి, వెయ్యి దీనార్లు (రూ.2.19 లక్షల ఇండియన్ కరెన్సీ), 5 తులాల బంగారు నగలు తదితరాలతో కలిపి మొత్తం రూ. 10 లక్షల సొత్తు తీసుకువచ్చారు. వీటన్నీటినీ డిక్కీలో భద్రపర్చి బయలుదేరారు. క్యాబ్‌లో డీజిల్ లేదని, డీజిల్‌కు పైసలు ఇవ్వాలని డ్రైవర్ అడగడంతో అతడికి బ్యాగులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. ఇదే క్రమంలో డ్రైవర్ ‘సార్.. మీ పాస్‌పోర్టు టాక్సీ స్టాండ్ వ ద్ద పడిపోయింది, చూడలేదా?’ అంటూ తికమకపెట్టాడు. నిజానికి వీరి పాస్‌పోర్టులు పోకున్నా, డ్రైవర్ మాటల్ని నమ్మి క్యాబ్‌ను వెనక్కి తీసుకెళ్లమన్నారు. డ్రైవర్ ట్యాక్సీ స్టాండ్‌కు తీసుకువచ్చి, ఇక్కడే పడి ఉంటుంది, చూడండని అన్నాడు. క్యాబ్ నుంచి ఒకరే దిగగా, మీ స్నేహితుడికి సహాయం చేయరా? అంటూ మరో యువకుడిని ప్రశ్నించడంతో అతనూ దిగి వెతకడం ప్రారంభించాడు. ఇదే అదనుగా భావిం చిన క్యాబ్ డ్రైవర్ సామాన్లతో కూడిన క్యాబ్‌ను తీసుకొని పరారయ్యాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు యువకులు శంషాబాద్ ఏయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆర్జీఐఏ క్రైమ్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.