బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ప్రొద్దుటూరు: మైనర్ బాలిక నిశ్చితార్థాన్ని ఐసీడీఎస్ అధికారులు శనివారం అడ్డుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గోకుల్ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తనకు వివాహం చేసేందుకు తల్లి ఏర్పాట్లు చేస్తోందని... త్వరలో ఖాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్‌తో నిశ్చితార్థం చేయబోతోందని టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఉదయాన్నే ఫోన్ చేసింది. వెంటనే టూటౌన్ ఎస్ఐ ఆంజనేయులు, అర్బన్ ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరిదేవి, సూపర్వైజర్ సావిత్రమ్మ ఆ బాలిక ఇంటికి వెళ్లారు. అనంతరం ఆ బాలిక, తల్లిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఐసీడీఎస్ అధికారుల చేత ఫిర్యాదు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ తన తల్లి తనకు బలవంతంగా వివాహం చేస్తోందని, ఆరు నెలల క్రితం కూడా ఫిర్యాదు చేయడంతో అప్పుడు కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చర్చించామన్నారు. ప్రస్తుతం మరో మారు ఈ బాలిక ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ భ్రమరాంభతోపాటు ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాలిక తల్లికి మద్దతుగా వకాల్తా పుచ్చుకోగా ఎస్ఐ డీఎస్పీ నీలం పూజిత వద్దకు పంపారు. డీఎస్పీ అధికారులపై ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయొద్దని, వారు పై అధికారుల ఆదేశాల ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు ఐసీడీఎస్ అధికారులు కడపలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శారదాతో చర్చించి బాలసదనంలో చేర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సుజాత, ఎల్.సుబ్బమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.