వాళ్లతో కొట్లాటకు కమెడియన్లు సరిపోతారు!
నవ్వులాటకు కాదు నిజమే.. ఉగ్రవాదులతో పోరాటానికి కమెడియన్ల (హాస్యగాళ్ల)ను పంపితే ప్రయోజనముంటందంటున్నాడు యూ2 ఫ్రంట్‌మ్యాన్ బొనో. యామీ షుమర్, క్రిస్ రాక్ వంటి కమెడియన్లను ఉగ్రవాదులతో పోరాటానికి అమెరికా ఉపయోగించుకోవాలని ఆయన సూచించాడు. 'నవ్వుకండి.. సీరియస్‌గా ఇస్తున్న సలహా ఇది' అని ఆయన చెప్పాడు.
మంగళవారం క్యాపిటల్ హిల్స్‌కు వచ్చి.. అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అంతర్జాతీయ శరణార్థి సంక్షోభం, ఉగ్రవాద హింస సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన సెనేట్ సభ్యులను కోరారు. అంతేకాకుండా సెనేట్ సబ్ కమిటీకి ఆయన కొన్ని పత్రాలను సమర్పించారు. మిలిటెంట్ల హింసను ఎదుర్కోవడానికి సెనేట్ కమెడియన్లను వినియోగించుకోవాలని ఆయన ఆ పత్రాల్లో కోరారు.
'హింసకు హింసే సమాధానంగా బదులిస్తే.. మనం కూడా ఉగ్రవాదుల భాషనే మాట్లాడినట్టు అవుతుంది. కానీ వారు వీధుల్లో కవాత్తు చేస్తున్నప్పుడు వారిని చూసి నవ్వితే.. వారి శక్తిని హరించివేస్తుంది. కాబట్టి, యామీ షుమర్, క్రిస్ రాక్, సచా బరాన్ కొహెన్ వంటి కమెడియన్లను పంపాల్సిందిగా నేను సెనేట్‌కు సూచిస్తున్నా' అని బొనె పేర్కొన్నారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి లక్షలమంది నిరాశ్రయులు వలస వస్తున్నారని, ఈ వలస కారణంగా యూరోపియన్ ఐక్యతకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఆయన చెప్పారు.