ఉడా రద్దుపై సమాచారం లేదు
* కొనసాగుతున్న అభివృద్ధి పనులు
* వీజీటీఎం ఉడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడి
విజయవాడ సెంట్రల్ : ఉడా రద్దు గురించి తమకు సమాచారం అందలేదని, అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఉడా కార్యాలయంలో వీజీటీఎం-ఉడా పాలక వర్గ సమావేశం శనివారం జరిగింది. అనంతరం చైర్మన్ తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినందువల్లే ఉడా పరిధిలో లేఅవుట్లను నిలిపేశామన్నారు. వీటి కోసం వచ్చే దరఖాస్తుల్ని ఎప్పటిలాగే స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బిల్డింగ్ ప్లాన్లు యథావిధిగా మంజూరు చేస్తున్నామన్నారు.
కోర్టు కేసులున్న ప్రాంతాల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఆగినట్లు చెప్పారు. గుణదల రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) కూలిన ఘటనపై మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఏయూడీ) నుంచి అనుమతులు రాకపోవడం వల్లే పనులు తిరిగి ప్రారంభం కాలేదని చెప్పారు. ఒక కాంట్రాక్టర్ లబ్ధి కోసమే పనులు నిలిపేశారనే వాదనల్ని ఆయన కొట్టిపారేశారు. లే అవుట్ రెగ్యులేషన్ స్కీం కింద 2,100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వైస్ చైర్మన్ ఉషాకుమారి, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు.
తీర్మానాలు
* గుంటూరు-అమరావతి-ఉంగుటూరు గ్రామాల మీదుగా కంభంపాడు వరకు రూ.3.50 కోట్లతో రోడ్డు నిర్మాణం. ఇందులో కోటి రూపాయలు మాత్రమే ఉడా భరిస్తోంది. మిగిలిన సొమ్మును వేరే ఏజెన్సీల నుంచి సమకూర్చుకోవాలి.
* ఉడాలో పనిచేస్తున్న, రిటైర్ అయిన ఉద్యోగులు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 350 గజాల ఇళ్ల స్థలాలు పొందితే మార్కెట్ ధర ప్రకారం కేటాయించాలి.
* 350 గజాల కంటే అధికంగా స్థలాలు పొందిన 9 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలి.
* ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి పంపాలి.
* గుంటూరు జిల్లా ప్రత్తిపాడు 16కి.మీ నుంచి 17.కి.మీ వరకు ఫోర్‌లైన్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.95 లక్షలు కేటాయించారు.
ఇది చివరి సమావేశం కాదు
ఉడా రద్దు అవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇదే చివరి పాలక వర్గ సమావేశం అవుతోందనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఉడా ఉంటుందో, ఊడుతోందో తెలియక ఉద్యోగులు హైరానాకు గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం కొందరు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఇది చివరి సమావేశం అనుకోవడం ఊహాజనితమన్నారు.