ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్న ఒవైసీ సోదరులు
ఎంఐఎంపై శివసేన విమర్శలు
ముంబై: ముంబై ముస్లింలను ఆల్ ఇండియా మజ్లిస్ ఇతైహాదుల్ ముస్లిమీన్ పార్టీ నేతలు తమ వ్యాఖ్యలతో తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సోదరులు స్థానికుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని ముస్లింలను వారు తప్పుదారి పట్టిస్తున్నారని శివసేన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టారు. నాందేడ్ మున్సిపల్లో విజయం తరువాత ఎంఐఎంని మరఠ్వావాడ కార్పొరేషన్కూ విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల ఎంఐఎం విజయం సాధించిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతి ఎంఐఎంపై చేసిన వ్యాఖ్యలను ఠాక్రే సమర్థించారు. ఆమెకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.