udhampur incident
-
అక్టోబర్‌లో అమిత్ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్ల కలకలం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో జంట పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉధంపూర్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో డొమిల్ చౌక్ వద్ద పార్క్ చేసిన ఖాళీ బస్సులో బధవారం రాత్రి మొదటి పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్ క్యాబిన్లో కూర్చున్న కండక్టర్ సునీల్ సింగ్(27), అతని స్నేహితుడు విజయ్ కుమార్(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 8 గంటల్లో రెండు పేలుళ్లు ఉధంపూర్ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద పార్క్ చేసిన బస్సులో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కాగా 8 గంటల వ్యవధిలో ఉధంపూర్ జిల్లాలో జరిగిన రెండో ప్రమాదం ఇది. మొదటి పేలుడు చోటుచేసుకున్న 4 కిలోమీటర్ల దూరంలోనే ఈపేలుడు జరిగింది. #WATCH | J&K: Investigation underway by Army Bomb Disposal Squad & dog squad at the bus stand in Udhampur. Two blasts occurred within 8 hours in Udhampur; two people got injured in the first blast and are now out of danger, no injury in 2nd blast, says DIG Udhampur-Reasi Range pic.twitter.com/DuCnMngqZq — ANI (@ANI) September 29, 2022 పేలుళ్లకు కారణం? పేలుడు జరిగిన సమీపంలో ఆపి ఉంచిన ఇతర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఉధంపూర్ డీఐజీ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు నెలల తర్వాత ఉధంపూర్ పట్టణంలో ఈ జంట పేలుళ్లు జరిగాయి. చివరగా ఈ ఏడాది మార్చి 9 న స్లాథియా చౌక్‌లో స్టిక్కీ బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కశ్మీర్‌కు రానున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
అవును.. వాడు మా అబ్బాయే!
అంగీకరించిన నావెద్ తండ్రి మహ్మద్ యాకూబ్ దురదృష్టవశాత్తు తానే అతడి తండ్రినని వెల్లడి లష్కరే తాయిబా, పాక్ సైన్యం వెంటాడుతున్నాయి మా అబ్బాయి చనిపోవాలని లష్కరే తాయిబా అనుకుంది ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీయే అన్నే విషయం మరోసారి స్పష్టంగా రుజువైంది. అతడు తమ దేశానికి చెందినవాడు కాదని పాకిస్థాన్ చెప్పినా.. నావెద్ సొంత తండ్రే అతడి జాతీయతను నిర్ధరించారు. నావెద్ తన కొడుకేనని, దురదృష్టవశాత్తు తాను అతడి తండ్రినని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు తమకు ప్రాణభయం ఉందని.. ఒకవైపు లష్కరే తాయిబా, మరోవైపు సైన్యం తమవెంట పడ్డాయని మహ్మద్ యాకూబ్ చెప్పారు. 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక అతడితో ఫోన్లో మాట్లాడింది. ''మీరు భారతదేశం నుంచి ఫోన్ చేస్తున్నారు.. ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. దురదృష్టవశాత్తు నేను నావెద్ తండ్రినే'' అని యాకూబ్ భయపడుతూ చెప్పారు. లష్కరే తాయిబా తమ కుటుంబాన్ని వెంటాడుతోందని.. బహుశా వాళ్లు నావెద్ అక్కడ చనిపోయి ఉండాలని అనుకున్నారేమోనని, కానీ అతడు సజీవంగా పట్టుబడటంతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. దయచేసి అతడిని వదిలేయాలని లష్కరే తాయిబాకు విజ్ఞప్తి చేశాడు. కేవలం 20 సెకండ్లు మాత్రమే మాట్లాడిన యాకూబ్.. తర్వాత ఫోన్ కట్ చేసి, స్విచాఫ్ కూడా చేసేశారు. -
లష్కరే తాయిబాలోనే నాకు శిక్షణ
పాకిస్థాన్‌లోని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది నావెద్ తెలిపాడు. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఈ వివరాలను అందించాడు. పాకిస్థాన్‌లో నావెద్ సహా చాలామంది తీవ్రవాదులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. లష్కరే తాయిబా వాళ్లకు రెండు రకాలుగా శిక్షణ ఇచ్చింది. శారీరక సామర్థ్యం పెంచుకోవడం, కొండలు ఎక్కడం, చిన్నపాటి ఆయుధాల తయారీపై తొలి దశలో శిక్షణ ఇచ్చారు. రెండో దశలో భారీ ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పొందిన తర్వాత.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వద్ద సరిహద్దులు దాటినట్లు నావెద్ వెల్లడించాడు. సరిహద్దులో ఉన్న కంచెను కట్ చేసి చొరబడినట్లు చెప్పాడు. తంగ్ మార్గ్, బాబారేషి ప్రాంతాల్లో తొలుత స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాడు. తర్వాత దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర, పుల్వామా ప్రాంతాలకు మార్చినట్లు తెలిపాడు. కొండల్లోని ఓ గుహలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు విచారణ అధికారులకు చెప్పాడు. తర్వాత రెండు బృందాలుగా విడిపోయామని, ట్రక్కు ఎక్కి ఉధంపూర్ చేరుకున్నామని అన్నాడు. నావెద్ వెల్లడించిన ప్రాంతాలకు వెళ్లిన అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. -
ఇద్దరు కుర్ర హీరోలు.. కుమ్మేశారు
ఇద్దరు హీరోలు.. ఇద్దరూ కుర్రాళ్లే.. కేవలం వాళ్లిద్దరే కలిసి అనేకమంది సైనికులను రక్షించారు. బీఎస్ఎఫ్ దళానికి చెందిన కానిస్టేబుల్ శుభేందురాయ్, రాకీ.. వీళ్లిద్దరు చూపించిన అసమాన ధైర్య సాహసాల వల్లే అనేకమంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఆగాయి. ఉగ్రవాదుల్లో ఒకడు అక్కడికక్కడే హతం కాగా, మరొకడు సజీవంగా పట్టుబడ్డాడు. బుధవారం నాడు శుభేందురాయ్ 30 మంది సిబ్బందితో కూడిన బస్సు నడుపుతున్నాడు. అంతలో.. ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ల దగ్గర భారీస్థాయిలో ఆయుధాలున్నాయి. ఒకడు కొండమీద పొజిషన్ తీసుకుని ఫైరింగ్ మొదలుపెట్టగా, రెండోవాడు బస్సును ఆపి ముందునుంచి కాల్చాడు. శుభేందురాయ్ గాయపడ్డాడు గానీ, ఉగ్రవాది నోమన్ బస్సులోకి రాకుండా ఆపాడు. డోరువద్దే వేలాడుతూ.. ఉగ్రవాదిని ఆపేశాడు. దాంతో నోమన్ బస్సు చుట్టూ తిరుగుతూ అన్నివైపులా కాలుస్తూ రెండోవైపు నుంచి బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పుడు బస్సు ముందుసీట్లో కూర్చున్న కానిస్టేబుల్ రాకీ లేచాడు. తన వద్ద ఉన్న ఇన్సాస్ రైఫిల్‌తో నోమన్‌ను ఎడా పెడా కాల్చిపారేశాడు. ఆ దెబ్బకు మ్యాగజైన్లో ఉన్న మొత్తం 40 బుల్లెట్లూ ఖాళీ అయిపోయాయి. నోమన్ చచ్చిపోతూ.. ఓ గ్రెనేడ్‌ను బస్సు డోరు వద్ద వదిలేశాడు. ఈలోపు అతడు తన ఏకే47తో కాల్చడంతో కానిస్టేబుళ్లు శుభేందు రాయ్, రాకీ ఇద్దరూ మరణించారు. అయితేనేం.. బస్సులో ఉన్న మొత్తం జవాన్లందరి ప్రాణాలూ కాపాడారు. ఆ ఉగ్రవాదులే లోనికి వచ్చి ఉంటే.. తమవద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో మొత్తం అందరినీ హతమార్చి ఉండేవాళ్లేమో! మరో జవాను కూడా ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇదంతా చూసిన నావేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ అక్కడినుంచి పారిపోయాడు. కానీ, అతడిని గ్రామస్థులు పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించారు. కసబ్ తర్వాత సజీవంగా దొరికిన ఏకైక పాక్ ఉగ్రవాది ఇతడే. అయితే అతడు తమ దేశస్థుడు కాడని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే.