లష్కరే తాయిబాలోనే నాకు శిక్షణ
పాకిస్థాన్లోని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్లో పట్టుబడ్డ ఉగ్రవాది నావెద్ తెలిపాడు. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఈ వివరాలను అందించాడు. పాకిస్థాన్లో నావెద్ సహా చాలామంది తీవ్రవాదులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. లష్కరే తాయిబా వాళ్లకు రెండు రకాలుగా శిక్షణ ఇచ్చింది. శారీరక సామర్థ్యం పెంచుకోవడం, కొండలు ఎక్కడం, చిన్నపాటి ఆయుధాల తయారీపై తొలి దశలో శిక్షణ ఇచ్చారు. రెండో దశలో భారీ ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ ఇచ్చారు.
ఆ శిక్షణ పొందిన తర్వాత.. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా వద్ద సరిహద్దులు దాటినట్లు నావెద్ వెల్లడించాడు. సరిహద్దులో ఉన్న కంచెను కట్ చేసి చొరబడినట్లు చెప్పాడు. తంగ్ మార్గ్, బాబారేషి ప్రాంతాల్లో తొలుత స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాడు. తర్వాత దక్షిణ కశ్మీర్లోని అవంతిపుర, పుల్వామా ప్రాంతాలకు మార్చినట్లు తెలిపాడు. కొండల్లోని ఓ గుహలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు విచారణ అధికారులకు చెప్పాడు. తర్వాత రెండు బృందాలుగా విడిపోయామని, ట్రక్కు ఎక్కి ఉధంపూర్ చేరుకున్నామని అన్నాడు. నావెద్ వెల్లడించిన ప్రాంతాలకు వెళ్లిన అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.