అవును.. వాడు మా అబ్బాయే!
అంగీకరించిన నావెద్ తండ్రి మహ్మద్ యాకూబ్
దురదృష్టవశాత్తు తానే అతడి తండ్రినని వెల్లడి
లష్కరే తాయిబా, పాక్ సైన్యం వెంటాడుతున్నాయి
మా అబ్బాయి చనిపోవాలని లష్కరే తాయిబా అనుకుంది
ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీయే అన్నే విషయం మరోసారి స్పష్టంగా రుజువైంది. అతడు తమ దేశానికి చెందినవాడు కాదని పాకిస్థాన్ చెప్పినా.. నావెద్ సొంత తండ్రే అతడి జాతీయతను నిర్ధరించారు. నావెద్ తన కొడుకేనని, దురదృష్టవశాత్తు తాను అతడి తండ్రినని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు తమకు ప్రాణభయం ఉందని.. ఒకవైపు లష్కరే తాయిబా, మరోవైపు సైన్యం తమవెంట పడ్డాయని మహ్మద్ యాకూబ్ చెప్పారు. 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక అతడితో ఫోన్లో మాట్లాడింది.
''మీరు భారతదేశం నుంచి ఫోన్ చేస్తున్నారు.. ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. దురదృష్టవశాత్తు నేను నావెద్ తండ్రినే'' అని యాకూబ్ భయపడుతూ చెప్పారు. లష్కరే తాయిబా తమ కుటుంబాన్ని వెంటాడుతోందని.. బహుశా వాళ్లు నావెద్ అక్కడ చనిపోయి ఉండాలని అనుకున్నారేమోనని, కానీ అతడు సజీవంగా పట్టుబడటంతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. దయచేసి అతడిని వదిలేయాలని లష్కరే తాయిబాకు విజ్ఞప్తి చేశాడు. కేవలం 20 సెకండ్లు మాత్రమే మాట్లాడిన యాకూబ్.. తర్వాత ఫోన్ కట్ చేసి, స్విచాఫ్ కూడా చేసేశారు.