qasim khan
-
అవును.. వాడు మా అబ్బాయే!
అంగీకరించిన నావెద్ తండ్రి మహ్మద్ యాకూబ్ దురదృష్టవశాత్తు తానే అతడి తండ్రినని వెల్లడి లష్కరే తాయిబా, పాక్ సైన్యం వెంటాడుతున్నాయి మా అబ్బాయి చనిపోవాలని లష్కరే తాయిబా అనుకుంది ఉధంపూర్ దాడి అనంతరం సజీవంగా పట్టుబడిన నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థానీయే అన్నే విషయం మరోసారి స్పష్టంగా రుజువైంది. అతడు తమ దేశానికి చెందినవాడు కాదని పాకిస్థాన్ చెప్పినా.. నావెద్ సొంత తండ్రే అతడి జాతీయతను నిర్ధరించారు. నావెద్ తన కొడుకేనని, దురదృష్టవశాత్తు తాను అతడి తండ్రినని ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు తమకు ప్రాణభయం ఉందని.. ఒకవైపు లష్కరే తాయిబా, మరోవైపు సైన్యం తమవెంట పడ్డాయని మహ్మద్ యాకూబ్ చెప్పారు. 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక అతడితో ఫోన్లో మాట్లాడింది. ''మీరు భారతదేశం నుంచి ఫోన్ చేస్తున్నారు.. ఈ విషయం తెలిస్తే మమ్మల్ని చంపేస్తారు. దురదృష్టవశాత్తు నేను నావెద్ తండ్రినే'' అని యాకూబ్ భయపడుతూ చెప్పారు. లష్కరే తాయిబా తమ కుటుంబాన్ని వెంటాడుతోందని.. బహుశా వాళ్లు నావెద్ అక్కడ చనిపోయి ఉండాలని అనుకున్నారేమోనని, కానీ అతడు సజీవంగా పట్టుబడటంతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. దయచేసి అతడిని వదిలేయాలని లష్కరే తాయిబాకు విజ్ఞప్తి చేశాడు. కేవలం 20 సెకండ్లు మాత్రమే మాట్లాడిన యాకూబ్.. తర్వాత ఫోన్ కట్ చేసి, స్విచాఫ్ కూడా చేసేశారు. -
ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదా
మా అసలు లక్ష్యం అమర్నాథ్ యాత్ర భారతసైన్యంపై కూడా దాడులు చేయాలనుకున్నాం హిందువులను చంపేందుకే ఇక్కడకు వచ్చా కశ్మీర్లో పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ వెల్లడి ఉదంపూర్ ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదాగా ఉంటుందని జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ చెప్పాడు. తమ లక్ష్యం అమర్నాథ్ యాత్ర, సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యమేనని అన్నాడు. తాను పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు వెల్లడించాడు. బీఎస్ఎఫ్ దళాలపై దాడి చేసి ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను హతమార్చిన తర్వాత ఒక ఉగ్రవాది హతం కాగా, నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసిం ఖాన్ మాత్రం సజీవంగా పట్టుబడిన విషయం తెలిసిందే. అతడి వయసు 20 ఏళ్లని అధికారులు గుర్తించారు. అలాగే మరణించిన ఉగ్రవాది పేరు నోమన్ అలియాస్ మొమిన్ ఖాన్ అని గుర్తించారు. హిందువులను చంపడానికే తాను వచ్చానని స్పష్టం చేశాడు. తనది పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ అని, 12 రోజుల క్రితం మొమిన్ ఖాన్ అనే సహచర ఉగ్రవాదితో కలిసి వచ్చానన్నాడు. మొమిన్ ఖాన్‌ది పాకిస్థాన్‌లోని భాగల్పూర్ ప్రాంతం. డార్క్ బ్లూ కలర్ షర్టు, బ్రౌన్ రంగు ప్యాంటు వేసుకొచ్చిన నావెద్.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. తాను కూడా సైన్యం చేతిలో చనిపోయి ఉంటే.. అది అల్లా దయేనని అనుకునేవాడినని, ఇదంతా చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. మొదట తన వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని చెప్పిన అతడు, తర్వాత విచారణలో అసలు వయసు వెల్లడించాడు. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎప్పుడు పట్టుబడినా.. తమ వయసు 18 ఏళ్ల లోపేనని చెప్పాలని, అలా అయితే బాల నేరస్థులుగా పరిగణిస్తారని వాళ్లకు శిక్షణలో చెబుతారు. -
మళ్లీ లష్కర్ పడగ?
ఉగ్రదాడితో దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంతో పాటు యావజ్జాతిని ఒక్కసారిగా వణికించిన లష్కరే తాయిబా.. మరోసారి మన దేశంపై తన పడగనీడ సారించినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం 26/11 దాడులకు పాల్పడి ముంబైలో భారీ మారణహోమం సృష్టించిన లష్క్రర్.. మళ్లీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నగరం మీద తన దృష్టి సారించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. జమ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ దళాలపై భారీ ఎత్తున దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఖాసింఖాన్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అతడు లష్కరే తాయిబాకు చెందినవాడే అయి ఉంటాడని కూడా భద్రతా దళాలు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడం ద్వారా ఒక్కసారిగా అనిశ్చితి సృష్టించాలని భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో తొమ్మిది మంది ఉగ్రవాదులు చేరారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఢిల్లీలోని సున్నిత ప్రాంతాలన్నింటిలో ఇప్పటికే హై ఎలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎక్కడ ఏ రూపంలో దాగున్నారో వాళ్ల అనుపానులు పసిగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో.. ఆ సందర్భంలోనే ఉగ్రవాదులు ఏమైనా దాడులకు కుట్రపన్నారా అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.