మళ్లీ లష్కర్ పడగ?
ఉగ్రదాడితో దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంతో పాటు యావజ్జాతిని ఒక్కసారిగా వణికించిన లష్కరే తాయిబా.. మరోసారి మన దేశంపై తన పడగనీడ సారించినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం 26/11 దాడులకు పాల్పడి ముంబైలో భారీ మారణహోమం సృష్టించిన లష్క్రర్.. మళ్లీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నగరం మీద తన దృష్టి సారించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
దీనికి తగ్గట్లే.. జమ్ము కాశ్మీర్లోని ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ దళాలపై భారీ ఎత్తున దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఖాసింఖాన్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అతడు లష్కరే తాయిబాకు చెందినవాడే అయి ఉంటాడని కూడా భద్రతా దళాలు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడం ద్వారా ఒక్కసారిగా అనిశ్చితి సృష్టించాలని భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో తొమ్మిది మంది ఉగ్రవాదులు చేరారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఢిల్లీలోని సున్నిత ప్రాంతాలన్నింటిలో ఇప్పటికే హై ఎలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎక్కడ ఏ రూపంలో దాగున్నారో వాళ్ల అనుపానులు పసిగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో.. ఆ సందర్భంలోనే ఉగ్రవాదులు ఏమైనా దాడులకు కుట్రపన్నారా అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.