ముంబై: భారత్‌పై విద్వేషం పెంచుకున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన ఉగ్రదాడులు దాదాపు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2008లో నవంబర్ 26న 10 మంది దేశ వాణిజ్య రాజధానిలో చొరబడి కాల్పులకు తెగబడిన ఘటనలో దాదాపు 166 మంది చనిపోయారు. ఈ మారణకాండకు కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్ మాత్రమే. 26/11 ముంబై దాడుల్లో కీలకమైన కసబ్‌ను గుర్తుపట్టి.. ఆ కేసులో సాక్షిగా ఉన్న హరిశ్చంద్ర శ్రీవార్ధంకర్ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అరవై ఏళ్ల వయస్సులో ముంబైలోని ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడి ఉన్న ఆయనను డీన్ డిసౌజా అనే ఓ షాపు ఓనర్ చేరదీసి.. స్వచ్చంద సంస్థకు అప్పగించారు. కసబ్, అబూ ఇస్మాయిల్ కామా ఆస్పత్రి వద్ద జరిపిన కాల్పుల్లో బులెట్ దెబ్బతిన్న హరిశ్చంద్రను ఇంటికి తీసుకువెళ్లడానికి.. అతడి కుటుంబం ఇష్టపడటం లేదని.. అందుకే ఆయనను ఆశ్రమానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. (దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే)
ఈ విషయం గురించి డిసౌజా స్నేహితుడు, ఐఎంకేర్స్ అనే ఎన్జీవో నడుపుతున్న గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘శ్రీవార్ధంకర్ మేము ఇచ్చిన ఆహారం తినడం లేదు. ఆయనకు స్నానం చేయించి.. జుట్టు కత్తిరించాం. తనలో తానే మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటల్లో హరిశ్చంద్ర, బీఎంసీ, మహాలక్ష్మి అనే పదాల ఆధారంగా బీఎంసీ కాలనీకి వెళ్లి ఆరా తీయగా... శ్రీవార్ధంకర్ సోదరుడు ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముంబై దాడుల ఘటనలో కీలక సాక్షిగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపారు. (ఆ షరతుకు ఒప్పుకుంటేనే తరలిస్తాం!)
ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాం. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవార్ధంకర్ కొడుకుకు ప్రత్యేక పాస్ జారీ చేసి ఆయనను తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే శ్రీవార్ధంకర్‌ను మాతో పాటే ఉండనివ్వమని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఉగ్రవాదికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన హీరో శ్రీవార్ధంకర్‌ను సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. తలపై గాయం కూడా ఉంది. ఆయనకు చికిత్స చేసేందుకు సహకరించండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment