నరమేధానికి ఐదేళ్లు
ముంబై: నగరంపై పాకిస్థాన్ ముష్కరులు నరమేధం సృష్టించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అరేబియా సముద్రం మీదుగా పడవల ద్వారా నగరంలోకి చొచ్చుకొచ్చిన పది మంది ఉగ్రవాదులు సృష్టించిన కాల్పుల అలజడిలో 166 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు. ఏ సమయంలోనైనా దాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చినా భద్రతా బలగాలు పట్టించుకోకపోవడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటనపై జాతి యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత ఈ ఘటనను అందరి మరిచిపోతున్నా భద్రత బలగాల బలహీనతలు మాత్రం నగవాసులను ఏ మూలనో భయపెడుతున్నాయి. వారి ఉదాసీనత వల్ల తమ ప్రాణాలకు ఎక్కడ ముప్పు కలుగుతుందోనని ఆందోళన చెందుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే 26/11 ఘటనలో ఎంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఇప్పటికే వారి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అయితే వీరు నిర్భయంగా జీవనాన్ని కొనసాగించేందుకు పోలీసు వ్యవస్థతో పాటు సర్కార్ భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ రోజు జరిగిందిలా...
కాగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు ఎటువంటి భద్రత లేని అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడ్డారు. అంతకుముందు పాకిస్థాన్ సముద్ర తీరాన్ని దాటివచ్చిన వీరంతా నవంబర్ 26వ తేదీ సాయంత్రం ప్రశాంతంగా వాణిజ్య రాజధానిలోకి అమాయకుల మాదిరిగా అడుగుపెట్టారు. కొలాబా తీరాన దిగిన వీరంతా ఒక క్రమపద్ధతితో రెండు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. వీరిలో అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ దిశగా ముందుకు సాగారు. అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు, ఇస్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు తొలుత నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌వైపు, ఆ తర్వాత కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసకాండకు దిగినట్టు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగిన నగర పోలీసులు, సైనిక బలగాలు, నౌకాదళ కమాండోలు, ఇతర పారామిలిటరీ బలగాలు 50 గంటల సుదీర్ఘ పోరాటం జరిపి 22 ఏళ్ల కసబ్ మినహా మిగతా ఉగ్రవాదులందరినీ హతమార్చాయి. ఇక నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద కసబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో సంచరించిన ఈ ఉగ్రవాద బృందం నర మేధానికి పాల్పడింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే విలేపార్లే ప్రాంతంలో తాము ఎక్కిన కారును బాంబులతో పేల్చివేసింది. ఆ తర్వాత ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ రాజీనామా చేశారు.
వివిధ బలగాల ఏర్పాటు
ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసిన ఈ భారీ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు భరోసానిచ్చేందుకు వివిధ ఫోర్స్‌లను ఏర్పాటుచేసింది. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు ఫోర్స్ వన్‌ను సృష్టించారు. ముంబైపై ముష్కరుల దాడి తర్వాత పోలీసు శాఖను పూర్తిగా ఆధునీకరించారు. మెరుగైన ఆయుధాలు, వాహనాలు అందించారు. సమాచార వ్యవస్థను పటిష్టపరిచింది. ప్రజల భద్రత కోసం సకల సౌకర్యాలను కల్పించారు. గోరేగావ్‌లో 96 ఎకరాల విస్తీర్ణంలో ఎలైట్ ఫోర్స్‌వన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2009 సంవత్సరంలో ఏర్పాటుచేసిన ఈ ఫోర్స్‌కు సీనియర్ పోలీసు అధికారి సదానంద్ తొలి స్పెషల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా నేతృత్వం వహిస్తున్నారు. జాతీయ భద్రత దళం(ఎన్‌ఎస్‌జీ) సిబ్బందికి కూడా శిక్షణ ఇచ్చే తరగతులు నిర్వహించింది. 26/11 ఘటన సమయంలో రంగంలోకి దిగిన ఎన్‌ఎస్‌జీ ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడంలో చాకచక్యంగా వ్యవహరించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కార్ ఎన్‌ఎస్‌జీ సిబ్బందిని పెంచుకుంది. నగరవాసుల భద్రత కోసం వివిధ బహిరంగ ప్రాంతాల్లో, ట్రాఫిక్ జంక్షన్‌లు, రైల్వే స్టేషన్, భారీ ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చింది. ముంబై, పుణేలో ఇప్పటికే ఈ పనులు పూర్తయ్యాయి. మిగతా నగరాల్లోనూ సీసీటీవీ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటోంది.