కీలక స్థానాల్లో పనిచేసి పదవులనుంచి తప్పుకున్న వారు రాసే పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. వారు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సంచలనాత్మకమైన ఘటనలు జరిగుంటే ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ తదితరులు రాసిన ఆత్మకథలు చెప్పుకోదగ్గ వివాదం రేపాయి. ఇందులో సంజయ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా అదే పేరుతో చలనచిత్రంగా కూడా వచ్చింది. కనుక ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా ‘లెట్ మీ సే ఇట్ నౌ’ పేరిట వెలు వరించిన గ్రంథం అందరిలోనూ ఆసక్తి కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ముంబై నగరం ఒకప్పుడు మాఫియా డాన్‌ల అడ్డా. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, సినీ నటుల్ని బెదిరించి డబ్బులు గుంజడం, మాట విననివారిని కిడ్నాప్ చేయడం, నేర సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు అక్కడ నిత్యకృత్యం.
2008 నవంబర్ 26న ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడి 173మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఘటన వీటన్నిటినీ తలదన్నింది. కన్నకూతురు షీనా బోరాను పథకం ప్రకారం రప్పించి, తన భర్తతో కలిసి ఆమెను పొట్టనబెట్టుకున్న ఇంద్రాణి ముఖర్జీ ఉదంతం కూడా అక్కడిదే. ఇలాంటి మహానగరంలోని పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ప్రత్యేకించి పోలీస్ కమిషనర్‌గా పని చేసిన రాకేష్ ఆత్మ కథ రాశారంటే ఆసక్తి అత్యంత సహజం. పైగా రాకేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా వున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత తన భర్త మరణానికి రాకేష్ వ్యవహరించిన తీరే కారణమని ఆరోపించారు. ఆ రోజు పోలీస్ కంట్రోల్ రూం ఇన్‌చార్జిగా వున్న రాకేష్ సరిగా మార్గదర్శకత్వం చేయనందువల్లే అశోక్ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారని ఒక పుస్తకంలో ఆమె చెప్పారు. అప్పట్లో రాకేష్ ఈ ఆరో పణలు కొట్టి పారేసినా తాజాగా ఆ ఎపిసోడ్ గురించి ఈ పుస్తకంలో ఏం రాసి వుంటారన్నది చూడా ల్సివుంది. అలాగే రాకేష్‌ను పదవీ విరమణకు చాలా ముందుగానే పోలీస్ కమిషనర్ పదవినుంచి తప్పించడం అప్పట్లో సంచలనం రేపింది. దాంతోపాటు బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఆయన కలవడం పెను వివాదమైంది. ఇంత నేపథ్యంవున్న రాకేష్ పుస్తకం రాశారంటే చదవకుండా ఎలావుంటారు?
అయితే ఈ ఆత్మకథలో ఇతరత్రా అంశాలకంటే ఉగ్రవాది కసబ్ గురించి ఆయన చెప్పిన అంశాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. దాని చుట్టూ వివాదం రాజేసేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ప్రయత్నించారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేలు రెండూ కసబ్ పేరును దినేశ్ చౌధరి అని మార్చి, నకిలీ ఐడీ కార్డు సృష్టించి, అతనితో కాషాయ రంగు తాడు కట్టించి, మారణాయుధాలిచ్చి ఉగ్రవాద దాడులకు పంపాయని రాకేష్ తెలిపారు. పీయూష్ గోయెల్ అభ్యంతరమల్లా ఈ సంగతి ఇన్నాళ్లూ ఎందుకు దాచివుంచారన్నదే. అందుకాయన రాకేష్‌తోపాటు అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగుందన్నది గోయెల్ అనుమానం. వాస్తవానికి ఈ సమాచారం కొత్తదేమీ కాదు. ఆ దాడి జరిగిన మరుసటి రోజునుంచే ఉగ్రవాదుల గురించి, వారి పన్నాగాల గురించి పుంఖానుపుంఖాలుగా కథ నాలు వెలువడ్డాయి. కసబ్‌ను ప్రశ్నించే క్రమంలో వెల్లడైన అంశాలన్నీ మీడియాలో అప్పట్లోనే ప్రము ఖంగా వచ్చాయి. ఉగ్రవాదుల వద్ద హైదరాబాద్, బెంగళూరు కళాశాలల్లో చదువుకుంటున్నట్టు దొంగ గుర్తింపు కార్డులుండటం, వాటిపై హిందువుల పేర్లు వుండటం పాత కథే. ఉగ్రవాద దాడులకు పథక రచన చేసింది ఐఎస్‌ఐ కనుక, దాడులు చేసేది భారత్‌లో కనుక తమ సంగతి బయట పడకుండా వుండటం కోసం, దర్యాప్తు సంస్థలను పక్కదోవ పట్టించేందుకు, అయోమయం సృష్టిం చేందుకు ఇదంతా చేసివుంటారని సులభంగానే గ్రహించవచ్చు.
ఇలాంటివి బయటపడినప్పుడు వెల్లడించడానికి ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకుంటుంది? రాకేష్ మారియా కూడా దాన్ని తొలి సారి బయటపెడుతున్నట్టు ప్రకటించలేదు. కసబ్‌ను తానే స్వయంగా ప్రశ్నించారు గనుక, దర్యా ప్తును పక్కదోవ పట్టించే పన్నాగంతో ఐఎస్‌ఐ ఏమేం చేసిందో చెప్పడానికి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కసబ్‌ను సజీవంగా పట్టుకున్న కానిస్టేబుల్ గురించి కూడా రాకేష్ ప్రస్తావించారు. కసబ్ సజీవంగా పట్టుబడకపోయివుంటే పాకి స్తాన్ కుట్రను రుజువు చేయడం కష్టమయ్యేది. దేశంలో అంతక్రితమూ, ఆ తర్వాత అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. వీటన్నిటిలో పాకిస్తాన్ ప్రమేయం వున్న సంగతి తెలుస్తూనే వున్నా అందుకు అవసరమైన పక్కా సాక్ష్యాలివ్వడం సాధ్యపడలేదు. ముంబై మహానగరం ఆర్థిక రాజధాని కనుక ఉగ్రవాదుల దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే నగర పోలీసులు వారిని మట్టు బెడతారని పాకిస్తాన్ ఊహించింది. కానీ పాక్ అంచనాలకు భిన్నంగా అనుకోకుండా కసబ్ పోలీసులకు చిక్కాడు.
ఒకప్పుడు తాము ఇష్టపడే నేతలు లేదా సెలబ్రిటీలు రాసిన ఆత్మకథల కోసం జనం ఆసక్తి కనబరిచేవారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది వుంటుందన్న భావనే అందుకు కారణం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. పదవీకాలంలో వివాదాస్పదులుగా పేరు తెచ్చుకున్నవారు రాసినా, ఆత్మకథల్లో వివాదాల ప్రస్తావనవున్నా వాటికి పఠితలు అధికంగానే వుంటున్నారు. ఈ పుస్తకంలో రాకేష్ తన తదనంతరం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ జావేద్, మరో పోలీస్ అధికారి దేవేన్ భారతిల గురించి చేసిన ప్రస్తావనలు ఇప్పుడు ముంబై పోలీసుల్లో కాక పుట్టిస్తున్నాయి. తన గురించి వున్నవీ లేనివీ రాశారని జావేద్ అంటున్నారు. ఏదేమైనా మారియా పుస్తకం విడుదలైన రోజే కావలసినంత వివాదం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment