థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.
మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్‌కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం!
Comments
Please login to add a commentAdd a comment