ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదా
మా అసలు లక్ష్యం అమర్నాథ్ యాత్ర
భారతసైన్యంపై కూడా దాడులు చేయాలనుకున్నాం
హిందువులను చంపేందుకే ఇక్కడకు వచ్చా
కశ్మీర్లో పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ వెల్లడి
ఉదంపూర్
ఉగ్రవాద దాడులు చేయడం భలే సరదాగా ఉంటుందని జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ చెప్పాడు. తమ లక్ష్యం అమర్నాథ్ యాత్ర, సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యమేనని అన్నాడు. తాను పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు వెల్లడించాడు.
బీఎస్ఎఫ్ దళాలపై దాడి చేసి ఇద్దరు బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లను హతమార్చిన తర్వాత ఒక ఉగ్రవాది హతం కాగా, నావెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అలియాస్ ఖాసిం ఖాన్ మాత్రం సజీవంగా పట్టుబడిన విషయం తెలిసిందే. అతడి వయసు 20 ఏళ్లని అధికారులు గుర్తించారు. అలాగే మరణించిన ఉగ్రవాది పేరు నోమన్ అలియాస్ మొమిన్ ఖాన్ అని గుర్తించారు. హిందువులను చంపడానికే తాను వచ్చానని స్పష్టం చేశాడు. తనది పాకిస్థాన్లోని ఫైసలాబాద్ అని, 12 రోజుల క్రితం మొమిన్ ఖాన్ అనే సహచర ఉగ్రవాదితో కలిసి వచ్చానన్నాడు. మొమిన్ ఖాన్ది పాకిస్థాన్లోని భాగల్పూర్ ప్రాంతం.
డార్క్ బ్లూ కలర్ షర్టు, బ్రౌన్ రంగు ప్యాంటు వేసుకొచ్చిన నావెద్.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. తాను కూడా సైన్యం చేతిలో చనిపోయి ఉంటే.. అది అల్లా దయేనని అనుకునేవాడినని, ఇదంతా చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. మొదట తన వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని చెప్పిన అతడు, తర్వాత విచారణలో అసలు వయసు వెల్లడించాడు. సాధారణంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎప్పుడు పట్టుబడినా.. తమ వయసు 18 ఏళ్ల లోపేనని చెప్పాలని, అలా అయితే బాల నేరస్థులుగా పరిగణిస్తారని వాళ్లకు శిక్షణలో చెబుతారు.