ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
పోలీసులు, విద్యార్థి నాయకులకు తోపులాట
పిడిగుద్దులతో రెచ్చిపోయిన పోలీసులు
పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ముకరంపుర : ఎంసెట్ పేపర్–2 లీకేజీని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తెలంగాణచౌరస్తా నుంచి వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎంసెట్ పేపర్–2 లీకేజీ బాధ్యులను శిక్షించాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పెనుగులాటలో కిందపడ్డ విద్యార్థులపై కొందరు పోలీసులు పిడిగుద్దులతో రెచ్చిపోయారు. కాళ్లతో తన్నారు. లాఠీలు ఝులిపించడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి నాయకులు కిరణ్, అనిరు«ద్, సాయి, తిరుపతి తీవ్రంగా గాయపడ్డారు. బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెంటమ్ జగదీశ్, జిల్లా కన్వీనర్లు సతీశ్, అనిల్, సంపత్, రాణా, స్వామి, అన్వేశ్, రంజిత్, ప్రవీణ్, రమేశ్, రఘు, అరవింద్, ప్రశాంత్, రాము, జయసింహ, హరి, రవి, మణి, నవీన్, రాజ్‌కుమార్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.