‘ఉగ్ర’ బోధకుడితో దిగ్విజయ్
కలకలం రేపుతున్న 2012 నాటి వీడియో
న్యూఢిల్లీ/ముంబై: 2012లో వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వేదిక పంచుకున్న వీడియో తాజాగా కలకలం రేపుతోంది. దీంతో బీజేపీ దిగ్విజయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. జకీర్ శాంతికి ప్రతిరూపమని దిగ్విజయ్ కొనియాడటాన్ని ఎండగట్టింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక రెస్టారెంట్లో 22 మందిని దారుణంగా హతమార్చిన కొందరు ఉగ్రవాదులు జకీర్ బోధనలతో స్ఫూర్తి పొందినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.
దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్తగా ముంబైలోని డోంగ్రీలో జకీర్‌కు చెందిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ కార్యాలయం వద్ద భద్రతా బలగాలను మోహరించింది. ‘ఆయన ప్రసంగాలను హోంశాఖ అధ్యయనం చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటుంది. మీడియాలో ప్రసారమైన ఆయన ప్రసంగాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. జకీర్‌తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ... తన చర్యను సమర్థించుకున్నారు.
జకీర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం కోసం సభ నిర్వహించారన్నారు. జకీర్ స్పందిస్తూ... ఇస్లాం పేరిట అమాయకులను చంపడానికి తాను వ్యతిరేకమన్నాడు. ప్రతి ముస్లిం.. టైస్టు కావాలని తాను చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భంలోనివి అని అన్నాడు.