umabharti
-
దళితులతో విందుపై ఉమాభారతి వ్యాఖ్యలివే..
సాక్షి, భోపాల్ : దళితులకు చేరువయ్యేందుకు పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో బీజేపీ నేతలు తడబడుతుంటే కేంద్ర మంత్రి ఉమాభారతి ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దళితుల ఇళ్లకు వెళ్లనని, తన ఇంటికే వారిని ఆహ్వానించి స్వయంగా వారికి వడ్డిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. తనతో భోజనం చేసిన వారంతా పునీతమవుతారని శ్రీరాముడిలా తాను భావించనని, దళితులు తమ ఇంటికి వచ్చి విందు ఆరగిస్తేనే తాము పునీతమవుతామని భావిస్తానన్నారు. మధ్యప్రదేశ్లోని చత్తార్పూర్ జిల్లాలో సామాజిక సమగ్రతా విందు కార్యక్రమంలో పాల్గొంటూ ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు. సామూహిక భోజనాల్లో తాను పాలుపంచుకోనని తాను స్వయంగా దళితుల వద్దకు వెళ్లడం లేదా వారిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించడం చేస్తానన్నారు. తన చేతులతో దళితులకు వడ్డించినప్పుడే తాము దీవించబడతామని నమ్ముతానన్నారు. ‘మీరు ఢిల్లీకి రండి..అక్కడ మీకు భోజనం పెడతా..మా మేనల్లుడు మీరు తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారు..అయితే ఇక్కడ మాత్రం మీతో కలిసి నేను విందు ఆరగించలే’నని ఈ సందర్భంగా వేదిక ముందున్న వారిని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. ఇక ఉమాభారతి వ్యాఖ్యలతో యూపీ మంత్రి దళితుల ఇళ్లకు వెళుతున్న మంత్రులను రాముడితో పోల్చారు. రామాయణంలో చెప్పినట్టు శబిరి ఎంగిలిపళ్లను తిన్న రాముడి మాదిరిగా బీజేపీ నేతలు సైతం దళితుల ఇళ్లకు వెళ్లి వారిని ఆశీర్వదిస్తున్నారని అన్నారు.మరోవైపు దళితుని ఇంట విందు ఆరగించిన యూపీ మంత్రి సురేష్ రాణా హోటల్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారన్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
అనారోగ్యం పాలైన ఉమాభారతి
బిజెపి సీనియర్ ఉపాధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ నేత ఉమాభారతి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఒక ఎన్నికల సభలో పాల్గొంటుండగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. దీంతో టికమ్ గఢ్ లోని ఓర్ఛా నగరంలో ఆమె కార్యక్రమం రద్దయింది. ఉమాభారతిని వెంటనే భోపాల్ లోని ఆమె నివాసానికి తీసుకువెళ్లారు. ఆమె జ్వరం, మూత్రపిండాల నొప్పితో బాధపడుతున్నారని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. శుక్రవారం నాడు నాలుగు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా నడుస్తూ వచ్చినందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యారని, అయితే దాన్ని పట్టించుకోకుండా గునా, మాలథౌన్, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లారు. ఆమె కోలుకున్న వెంటనే పార్టీ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.