ప్రపంచంలో బెస్ట్ హోటల్ మనదే తెలుసా!
జైపూర్: భారత గత చరిత్ర వైభవానికి, రాజరిక విలాసానికి చిహ్నంగా నిలిచే.. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ 2016 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా నిలిచింది. ట్రిప్ అడ్వయిజర్ వెబ్సైట్ ఈ మేరకు 'ట్రావెలర్స్ చాయిస్ అవార్డు'ను ప్యాలెస్‌కు ప్రకటించింది. అలనాటి రాజరిక వైభవాన్ని కళ్లకు కట్టే అనుభవాన్ని, అనుభూతిని ఈ ప్యాలెస్ తమకు అందించిందని పర్యాటకులు పేర్కొన్నారు. అంతేకాకుండా 840 మంది అతిథులు దీనికి ఐదుకు ఐదు రేటింగ్ ఇచ్చి అగ్రస్థానంలో నిలబెట్టారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ వెబ్సైట్ అయిన ట్రిప్ అడ్వయిజర్ తన 14వ ఎడిషన్ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్ ను ఈ ప్యాలెస్‌కు ప్రకటించింది.
1928-43 మధ్యకాలంలో 15 ఏళ్లపాటు శ్రమించి ఈ అద్భుతమైన రాజరిక భవనాన్ని నిర్మించారు. జోధ్‌పూర్ వంశానికి చెందిన మహారాజ ఉమైద్ సింగ్ పేరిట దీనికి ఉమైద్ భవన్ ప్యాలెస్ అని నామకరణం చేశారు. ఇది మొదట్లో జోధ్‌పూర్ రాజవంశానికి ప్రధాన నివాసంగా కొనసాగింది.
ప్రాక్పశ్చిమ సంస్కృతులు, శిల్పకళారీతుల సమ్మేళనంగా ఐరోపా సాంస్కృతిక పునర్జీవనం, ఆర్ట్ డెకో ప్రభావంతో రూపొందిన ఈ ప్యాలెస్ రాజ్‌పుత్ చారిత్రక వారసత్వానికి నిలువటద్దంగా నిలిచిపోయింది. 347 గదులున్న ఈ ప్యాలెస్‌లో విహరించడం అద్భుతమైన అనుభూతి అంటూ ఎంతోమంది పర్యాటకులు తమ సమీక్షల్లో వివరించారు. ' ప్రత్యక్ష స్వప్నంలో విహరిస్తున్నట్టు తోచింది. అత్యద్భుతమైన అనుభవాన్ని ఈ రాజరిక కట్టడం మాకు అందించింది' అంటూ ఓ పర్యాటకుడు తన రివ్యూలో పేర్కొన్నారు.
ట్రిప్అడ్వైజర్ సభ్యుల ప్రకారం 2016లో టాప్ 10 హోటల్స్ ఇలా ఉన్నాయి
1. ఉమైద్ భవన్ ప్యాలస్ - జోథ్‌పూర్, భారతదేశం
2. షింతామణి రిసార్ట్ - సీమ్ రీప్, కంబోడియా
3. బెల్వ్యూ సిరెన్ - సారెంటో, ఇటలీ
4. హనొయ్ లా సీస్టా హోటల్ అండ్ స్పా- హనొయ్, వియత్నాం
5. యాక్టిస్ హోటల్ - అఫిటోస్, గ్రీస్
6. బెల్మాండ్ లే మానాయిర్ ఆక్స్ క్వెట్సైసన్ - గ్రేట్ మిల్టన్, యునైటెడ్ కింగ్డమ్
7. మిరిహి ఐలాండ్ రిసార్ట్- మిరిహి, మాల్దీవులు
8. బుకుటి అండ్ తారా బీచ్ రిసార్ట్స్ అరుబా - పామ్ ఈగిల్ బీచ్ , అరుబా
9. కాలాబాష్ లగ్జరీ బోటిక్యూ హోటల్ అండ్ స్పా- లాన్స్ ఆక్స్ ఎప్పిన్స్, గ్రెనడా
10. హోటల్ రిట్టా హఫ్నర్ - గ్రమడో, బ్రెజిల్