'నా కొడుకు ఉగ్రవాది కాదు.. పాక్ వెళ్లడు'
న్యూఢిల్లీ: తన కుమారుడు ఉగ్రవాది కాదని జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న ఉమర్ ఖలీద్ తండ్రి అన్నారు. జేఎన్‌యూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతోపాటు ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలతో పోలీసులు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ మరో 15మంది యువతులపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా కన్హయ్యను అరెస్టు చేయగా ఖలీద్ ఇంకా దొరకలేదు.
అతడు ఉగ్రవాదేనని, పాకిస్థాన్‌కు పారిపోయి ఉంటాడని పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖలీద్ తండ్రి స్పందించాడు. 'నా కుమారుడు ఉగ్రవాది కాదు. అతడు అసలు పాకిస్థాన్ వెళ్లనే లేదు. అతడివద్ద పాస్ పోర్ట్ కూడా లేదు. నేను అతడికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడున్నా బయటకు రావాలని.. విచారణ ఎదుర్కోవాలని. నాకు ఈ భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నేను అతడి భద్రత గురించే భయపడుతున్నాను' అని చెప్పాడు.