un healthy
-
710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్‌ఐసీయూలోనే
సాక్షి, హైదరాబాద్: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీ పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు. పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్‌కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు. -
దుబాయ్‌లో బోరిగాం వాసి మృతి
సారంగపూర్(నిర్మల్): మండలంలోని బోరిగాం గ్రామానికి చెందిన బొల్లి నర్సయ్య(39) అనారోగ్యంతో శుక్రవారం దుబాయ్‌లో మృతి చెందాడని ఆయన కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం మృతుడు నర్సయ్య ఉపాధి కోసం దుబాయిలోని అబుదాభికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో రెండు నెలల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం తిరిగి 20 రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. కానీ, అక్కడ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అక్కడి కంపెనీ యాజమాన్యం ఆయనను అబుదాభిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ నర్సయ్య శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. నర్సయ్య మృతి వార్త తెలుసుకున్న వలస కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతుగంటి సాయేందర్ బోరిగాం చేరుకుని ఆయన భార్య ప్రమీల నుంచి వివరాలు సేకరించారు. అలాగే మృతుడు బొల్లి నర్సయ్యకు చెందిన ఆధార్‌కార్డు తదితర వివరాలు తెలుసుకొని త్వరలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని సాయేందర్ తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. -
మెరుగవుతున్న కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎంకే కరుణానిధి(94) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టంచేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ప్రస్తుతం జ్వరంతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతోందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్ తెలిపారు. కలైంజర్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నందున గోపాలపురంలోని ఆయన నివాసానికి రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను స్టాలిన్ కోరారు. పరామర్శల వెల్లువ.. కరుణ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని∙మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు స్టాలిన్, కుమార్తె కణిమొళికి ఫోన్ చేసి కరుణ∙ఆరోగ్యంపై వాకబు చేశారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి తన కుమారుడు దురై దయానిధిని వెంటపెట్టుకుని గోపాలపురంలోని ఇంటికి శుక్రవారం చేరుకున్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన కుమారుడు స్టాలిన్ స్పందించారు.‘ సవాళ్లను విజయాలుగా మార్చుకునే మన నాయకుడు గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో దృఢమైన శక్తిగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. కొనసాగిన ఉత్కంఠ.. కరుణ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించడంతో డ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, తోటి మంత్రులు కరుణ ఇంటికి వెళ్లి స్టాలిన్‌ను కలవడం, ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ పెరిగింది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోందని వార్తలొచ్చాయి. చివరకు కరుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్టాలిన్ ప్రకటించినప్పటికీ ఆయన ఇంటివద్ద నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గలేదు. కాగా, కరుణకు పూర్తి విశ్రాంతి అవసరమని డీఎంకే వర్గాలు తెలిపాయి. ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆదివారం చెన్నైకి చేరుకోనున్నారు. -
అనారోగ్యానికి కేరాఫ్ ఆయిల్ ఫుడ్
శ్రీకాకుళం రూరల్ : ఆహార పదార్థాల్లో కొద్దిగా నూనె కనిపించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. గారెలు, బూరెలు, అరిసెలు, బోండాలు, బజ్జీలు వంటిì వాటిల్లో నూనె కారుతున్నా ఇష్టంగా తినేవారు. ఇది నాటి పరిస్థితి. కాలం మారింది. ఆహారపు అలవాటుల్లో మార్పు వచ్చింది. డైటింగ్ వంటి వాటివల్ల చాలా మంది నూనె వస్తువులు చూసిన వెంటనే మొహం చాటేస్తున్నారు. అయితే చిన్నారులు, యువత మాత్రం నూనెతో తయారీ చేసే పదార్థాలను ఇష్టంగా తింటున్నారు. ఎండలు మండుతున్నా నూనెతో తయారీ అయ్యే వస్తువులను రుచి చూడాలన్నా ఆత్రుత పోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ ఫుడ్ తినడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం నగరం పరిధిలో సాయంత్రం అయితే చాలు ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్ జోరుగా విక్రయిస్తున్నారు. టిఫిన్లతో పాటు ఆయిల్‌తో తయారయ్యే సమోసాలు, బోండాలు, బజ్జీలు, వడలు, చికెన్ పకోడీలు వంటివి జోరుగా అమ్ముతున్నారు. నాసిరకం నూనెలు వినియోగం వ్యాపారులు నాణ్యమైన నూనెను వినియోగించకుండా తక్కువ ధరకు దొరికే నాసిరకం నూనెలను ఉపయోగిస్తున్నారు. ఒకరోజు వంటచేయగా మిగిలిపోయిన నూనెను మరుసటి రోజు, తర్వాత రోజు కూడా ఉపయోగిస్తున్నారు. దీనికారణంగా ఆయిల్ బాగా కాగి చిక్కదనం అవుతోంది. నిత్యం ఇదే ఆయిల్‌తో వివిధ రకాల వంటకాలు వండటం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఇలా.. ఎండా కాలంలో నాసిరకమైన, పదేపదే మరిగించిన నూనెలతో తయారు చేసిన వంటలు తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, ఉబ్బసం, కడుపు, ఛాతీలో మంట, ఎసిడిటీ, అధిక దాహం, ఆరాటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాన్సర్ సోకేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కళ్లు తిరిగి పడిపోవడం, రక్తపోటు పెరగటం, గుండె కొట్టుకోవడంలో వివిధ మార్పులు,చోటు చేసుకుంటాయి. నూనె పదార్థాలు వల్ల శరీరంలో మరింత ఉష్ణోగ్రత పెరిగి నీరసం, వడదెబ్బకు దారితీస్తోంది. జీర్ణకోశ వ్యాధితో పాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. వేసవి కాలంలో ఆయిల్ ఫుడ్‌ను ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. రోడ్డుపక్కన అమ్మే పానీపూరి, ఫాస్ట్ఫుడ్స్, చపాతి, ఛాట్‌లతో పాటు ఇతరత్రా వాటికి దూరంగా ఉండటం మంచిది. వేసవిలో అంబలి, కొబ్బరి బొండాలు, బార్లీ, గ్లూకోజ్, నిమ్మరసాలు తీసుకుంటే చాలా మంచిది. – సూరజ్ పట్నాయక్, రిమ్స్ వైద్యులు, శ్రీకాకుళం -
దుమ్ములేస్తున్న క్రీడామైదానం
ఆదిలాబాద్‌కల్చరల్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాలిపడితే దుమ్ములేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే మూడో క్రీడా పాఠశాలగా ఉన్న జిల్లా కేంద్రంలోని క్రీడాకారులకు మైదానంలో అసౌకర్యాలు దర్శనమిస్తున్నాయి. క్రీడాకారులు రన్నింగ్ చేసిన, వాకింగ్ చేసినా దుమ్ములేస్తోంది. స్టేడియంలోని 800 ట్రాక్, 400 ట్రాక్‌లు నడిస్తేనే దుమ్ములేస్తున్నాయి. దీనికి తోడు కోచ్‌లు క్రీడా షెడ్యూల్డ్ ప్రకారం స్పోర్ట్స్ అకాడమి విద్యార్థులు శిక్షణ నివ్వకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, పెద్దలు, క్రీడాకారులు, మహిళలు, చిన్నారులు, అనారోగ్యం నుంచి విముక్తి పొందేందుకు మరికొందరు మైదానానికి వస్తుంటారు. ఇక్కడి పరిస్థితులతో వచ్చేందుకు పలువురు జంక్కుతున్నారు. కనిపించని ఉద్యోగులు సేవలు... ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, పాఠశాల క్రీడా ఆకాడమిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కావడంతో సమస్యాత్మకంగా మారింది. కోచ్‌లు క్రీడాకారులకు అనువుగా గ్రౌండ్‌మెన్లు మైదానాన్ని తీర్చిదిద్దేలా చూడాలి. క్రీడాకారులకు ఏ ఆటల ఆడిస్తున్నారు. ఆటల మైదానం సంక్రమంగా ఉందా లేదా పరిశీలించి అనుగుణంగా తీర్చిదిద్దేలా చూడాలి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హకీ, పుడ్‌బాల్, క్రికెట్మైదానాలను వాటరింగ్చేసి, వాటిలో గ్రీస్వేసి క్రీడాకారులకు చేదోడువాదోడుగా ఉండాలి. ఆనారోగ్యంగా మైదానం... ప్రస్తుత సమాజంలో చాలా వరకు కాలుష్యం పెరిగి, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీన పడే వారి సంఖ్యలో ఎక్కుగానే ఉంటుంది. క్రీడాకారులపై దుమ్మునుంచి వచ్చే ప్రభావం తీవ్రంగా చూపే ప్రమాదం వుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అస్వస్థతకు గురిచేసి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే మైదానాలు క్రీడాకారులకు శాపంగా మారవద్దని చెబుతున్నారు. మైదానం ఆరోగ్యాన్నిచ్చేలా చూడాలి ప్రభుత్వం మైదానాలలో నడిస్తే ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కానీ, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీనపడేలా ఉండకూడదు. అధికారులు చోరవతీసుకుని వాటరింగ్ చేసి దుమ్ములేకుండా చూడాలి. క్రీడాకారులుకు, ప్రజలకు అనువుగా మైదానాలను తీర్చిదిద్దాలి. –శ్రీనివాస్, కైలాస్‌నగర్ ఆదిలాబాద్ సిబ్బందిని అదనంగా నియమించాలి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసేందుకు క్రీడామైదానంలో సౌకర్యాలు సిబ్బంది కల్పించాలి. అలా పనిచేయని కాంట్రాక్ట్ సోసైటీ పై ఫిర్యాదు చేసి కాంట్రాక్ట్ రద్దు చేసేలా చూడాలి. పనిచేయని సిబ్బందిని తొలగించి పనిచేసే వారికే ప్రాదాన్యత కల్పించాలి. క్రీడాకారుల ఆరోగ్యం విషయంలో దృష్టిసారించాలి. – ప్రవీణ్, రాంనగర్, ఆదిలాబాద్ విచారించి చర్యలు తీసుకుంటాం గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఇకముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా విచారించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం. ప్రత్యక్షంగా పరిశీలించి క్రీడాకారులు సౌకర్యాలు కల్పిస్తాం. కోచ్‌లకు సైతం నిబంధనల కూడిన షెడ్యూల్డ్‌లను అందిస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో, ఆదిలాబాద్ -
విరేచనాలతో వ్యక్తి మృతి
ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన తలారి నరసింహులు(55) విరేచనాలతో బాధపడుతూ మతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. వారం నుంచి విరేచనాలతో బాధపడుతూ కదిరి, బత్తలపల్లి, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా మారడటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మతి చెందినట్లు వారు తెలిపారు. అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.