ఎల్జీబీటీ వివక్ష పరిశీలనకు నిపుణుడి నియామకం
ఐరాస తీర్మానం ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
జెనీవా/న్యూఢిల్లీ: ఎల్జీబీటీ(గే, లెస్బియన్, ద్విలింగ సంపర్కం, ట్రాన్స్‌జెండర్ ) వర్గం ఎదుర్కొంటున్న హింస, వివక్ష సంఘటనల పరిశీలనకు స్వతంత్ర నిపుణుడ్ని ఏర్పాటు చేయాలని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం జెనీవాలో నిర్వహించిన ఓటింగ్‌లో తీర్మానం తక్కువ ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. 23 దేశాలు అనుకూలంగా, 18 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా మూడు దేశాలు గైర్హాజరయ్యాయి.
తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. మూడేళ్ల కాల వ్యవధితో పనిచేసే ఈ స్వతంత్ర నిపుణుడు గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్లపై హింస వివరాల్ని పరిశీలిస్తారు. భారత్ నిర్ణయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ సమర్థించుకున్నారు. ఎల్జీబీటీ అంశంలో భారత్‌లో న్యాయపరంగా ఉన్న వాస్తవం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎల్జీబీటీ హక్కుల అంశం సుప్రీం పరిధిలో ఉందని, వివిధ సంస్థలు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశాయని, వాటిపై నిర్ణయం వెల్లడవాల్సి ఉందన్నారు.