డాలర్ దెబ్బకు రూపాయి విలవిల
ముంబై: డాలర్ విలువు రోజురోజుకి పుంజుకోవడంతో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. విశ్లేషకులు భయపడిపట్టుగానే రికార్డు స్థాయిని నమోదుచేసింది. గురువారం మరో 28 పైసలు నష్టపోయిరన రూపాయి 68.84 స్థాయిని తాకింది. దీంతో 39 నెలల కనిష్టానికి చేరి మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
రూపాయి డాలర్‌తో పోలిస్తే నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అయితే 68.68-69 మధ్య డాలర్ - రూపాయి విలువ కదలాడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనత రాబోయే కాలంలో కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు . రాబోయే 1-2 నెలల్లో 69.30 స్థాయిని తాకొచ్చని కోటక్ సెక్యూరిటీస్ కరెన్సీ డెరివేటివ్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ చెప్పారు. అంతేకాదు 7-8 నెలల తర్వాత ఇది 70.50-71 స్థాయికి దిగజారవచ్చని అంచనా వేస్తున్నారు.
యూఎస్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు డాలర్‌ను 14 ఏళ్ల గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. అంతర్జాతీయ అనేక కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోలాల్డ్ ట్రంప్ విజయం తర్వాత దేశీయ కరెన్సీ విలువ 2.92 శాతం క్షీణించింది.
అటు దేశీయ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెద్ద నోట్లరద్దు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దిగ్గజకంపెనీల సూచీల్ని కుప్పకూలుతున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా నేల చూపులు చూస్తున్నాయి.