ప్రజలను మభ్యపెట్టొద్దు
ఎమ్మిగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టత లేని విధానాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో రాజకీయాల్లో తాత్కాలిక ప్రయోజనం పొందినా.. అంతిమంగా ప్రజల విశ్వాసం కోల్పోక తప్పదన్నారు.
గతంలో రాష్ట్రాన్ని పాలించిన అనుభవంతో రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం తగదన్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ.. రోజుకో ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని.. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి అందరినీ నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నారన్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయిన రైతులు, మహిళలకు రుణాల వడ్డీ తలకు మించిన భారమవుతోందన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారి బాధలను అర్థం చేసుకుని హామీలపై స్పష్టతనివ్వాలన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. అర్హులైన నిరుపేదలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ టీడీపీ వర్గీయులకు కట్టబెట్టడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తానిచ్చిన హామీలపై చంద్రబాబు పునరాలోచించుకుని అమలు దిశగా అడుగులు వేయాలని.. లేదంటే భవిష్యత్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.