Underground mine workers
-
గనిలో చిక్కుకున్న కార్మికుడి మృతి
సాక్షి, కోల్‌బెల్ట్: సింగరేణి యంత్రాంగం చేపట్టిన 48 గంటల ఆపరేషన్ తర్వాత గని కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు శుక్రవారం గుర్తించారు. సపోర్ట్‌మెన్ కార్మికుడు సత్యనారాయణ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో బుధవారం మొదటి షిఫ్టుకు హాజరయ్యాడు. గనిలోని 36వ డిప్ 3వ సీం ఎస్–7 ప్యానల్ వద్ద 11 లెవల్లో బారికేడ్ వద్ద విధులు నిర్వర్తిసుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో బారికేడ్‌కు రంధ్రం ఏర్పడిందని తెలియడంతో అక్కడికి వెళ్లాడు. అవుట్ మస్టర్ పడకపోవటంతో.. మధ్యాహ్నం విధుల ముగించుకున్న తర్వాత సత్యనారాయణ అవుట్ మస్టరు పడక పోవటంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఆచూకీ కోసం గనిలో ఆపరేషన్ చేపట్టారు. అతను విధులు నిర్వర్తిస్తున్న 11 లెవల్ బారికేడ్ వద్ద నుంచి 21 లెవల్ వరకు ఆరు రెస్క్యూ టీంలు ఎస్డీఎల్ యంత్రంతో రెండు రోజుల పాటు ఇసుకను తొలగిస్తూ ఆపరేషన్ చేపట్టారు. అయితే 20వ లెవల్ వద్ద సత్యనారాయణ వెంట తీసుకువెళ్లిన హెడ్ లైట్ దొరకటంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుమారు 350 మీటర్ల దూరంలోని ఇసుకను తొలగించగా చివరకు 20వ లెవల్ ఈస్ట్ ఆఫ్ 35 డిప్ జంక్షన్‌కు 12 మీటర్ల దూరంలో 21వ లెవల్ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సత్యనారాయణ శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. మృత దేహాన్ని బయటకు తీసిన అనంతరం అంబులెన్స్‌లో మంజూర్‌నగర్ సింగరేణి ఆస్పత్రికి తరలించారు. బారికేడ్‌కు 0.06 మీటర్ల మేర రంధ్రం పడి ఇసుక, నీరు ఉధృతంగా ప్రవహించినందున సత్యనారాయణ కొట్టుకు పోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గాలింపులో భాగంగా 50 మంది మైనింగ్ ఉద్యోగులు గనిలోని ఇతర గుళాయిలలో వెతికారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ.. గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీని కనుగొనడానికి సింగరేణికి చెందిన జీఎం సేఫ్టీ ఎం.వసంతకుమార్, జీఎం రెస్క్యూ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, రీజియన్ సేఫ్టీ జీఎం కలువల నారాయణ, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, ఏరియా జనరల్ మేనేజర్ కొండబత్తిని గురువయ్య గని వద్ద మకాం వేసి నిరంతరం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. గని ప్రమాదంపై డీడీఎంఎస్ విచారణ గని ప్రమాదంలో కార్మికుడు సత్యనారాయణ మృతి చెందటం పట్ల మైనింగ్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డీడీఎంఎస్ సుబ్రహ్మణ్యం గనిలోని సంఘటనా స్ధలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. కేటీకే–1 గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీ కనుగొనడానికి 48 గంటల సమయం పట్టడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని సత్యనారాయణ కుమారుడు శ్రవన్ శుక్రవారం గని ఆవరణలో జీఎంను నిలదీశాడు. శ్రవన్ బోరున విలపించగా అక్కడే ఉన్న కార్మికులను కంటతడిపెట్టారు. మార్చురి వద్ద మృతుని భార్య అన్నపూర్ణతో పాటు బంధువుల రోధనలు కలచి వేశాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకులు కొక్కుల తిరుపతి, బడితెల సమ్మయ్య, రత్నం అవినాష్‌రెడ్డి, కోటేశ్వర్రావు, మల్లేష్, వెంకటేశ్వర్లు, బాలాజీ, కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, భీమా, రత్నం సమ్మిరెడ్డి, కె.నర్సింగరావు చేపట్టారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం.. గని కార్మికుడు సత్యనారాయణ కుటుంబాన్ని సింగరేణి సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కుటుంబంలో ఒకరికి 10 రోజులలో సంస్థలో ఉద్యోగం కల్పిస్తాం. గని ప్రమాదంలో మృతి చెందినందున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను అందజేసేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటాం. – కె.గురువయ్య, ఏరియా జీఎం -
గనిలో కార్మికుడి గల్లంతు.. దొరకని ఆచూకీ
సాక్షి, కోల్‌బెల్ట్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో సపోర్ట్‌మెన్ కార్మికుడు రాయుడు సత్యనారాయణ గల్లంతై 24 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. దీంతో గని వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బుధవారం మొదటి షిఫ్టు విధులకు హాజరైన సత్యనారాయణ మధ్యాహ్నం నుంచి కనిపించక పోవడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ, మైనింగ్ స్టాఫ్ బృందాలు గనిలో గాలిస్తున్నాయి. సింగరేణికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు గని వద్దే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గని ఆవరణలోకి వందలాది మంది కార్మికులు చేరుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం ఉదయం అక్కడికి చేరుకుని సింగరేణి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గనిలో తప్పిపోయిన కార్మికు డి కుటుంబ సభ్యులు గని సమీపంలోనే బిక్కుబిక్కు మంటూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అసలేం జరిగింది.. కేటీకే–1 గనిలోని 36వ డిప్ 3వ సీం ఎస్–7 ప్యానల్ వద్ద 11 లెవల్లో బారికేడ్ వద్ద బుధవారం మొదటి షిఫ్టు విధులకు సపోర్టుమెన్ రాయుడు సత్యనారాయణ హాజరయ్యాడు. ఈక్రమంలో రిలే–డి కి చెందిన ఓవర్‌మెన్ 35 డిప్‌లోని ట్రావెలింగ్ రోడ్లో నీరు వస్తుంది.. అదుపు చేయాలని సత్యనారాయణకు ఆదేశాలు ఇవ్వటంతో ఆయన అక్కడికి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి సత్యనారాయణ ఆచూకీ కనిపించకపోవడంతో గని అధికారులకు సమాచారం అందించగా రెస్క్యూ, మైనింగ్ స్టాఫ్ సిబ్బంది రంగంలోకి దిగి పని ప్రదేశాల్లో వెతికారు. 11వ లెవల్ నుంచి 19 లెవల్ వరకు ఇసుకలో చిక్కుకున్నాడనే అనుమానంతో ఎస్డీఎల్ యంత్రాలతో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గాలింపు ముమ్మరం.. రామగుండం రిజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, జీఎం ఎస్టేట్ ప్రేంకుమార్, ఏరియా జనరల్ మేనేజర్ కె.గురువయ్య ఆధ్వర్యంలో గురువారం గాలింపు ముమ్మరం చేశారు. మందమర్రి, గోదావరిఖనికి చెందిన రెండు, భూపాలపల్లికి చెందిన నాలుగు రెస్క్యూ బృందాలకు చెందిన 30 మంది, మైనింగ్ స్టాఫ్‌తో ఏర్పాటు చేసిన మరో 30 మంది గనిలోని పని స్థలాలకు వెళ్లి వెతుకుతున్నారు. గాలింపు చర్యలను ఎస్ఓటు జీఎం పద్మనాభరెడ్డి, గ్రూప్ ఆఫ్ ఏజెంట్ టీవీ.రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బచ్చ రవీందర్, సెక్యూరిటీ ఆఫీసర్ మధుకర్, డీవైజీఎం రాజేంద్రకుమార్, గని మేనేజర్ క్రిష్ణప్రసాద్ పర్యవేక్షించారు. గని వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న జీఎం గురువయ్య 20 లెవల్ వద్ద క్యాప్‌లైటు లభ్యం.. గనిలోని 20 లెవల్ వద్ద సత్యనారాయణకు చెందిన క్యాప్‌లైటు గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. 11వ లెవల్ వద్ద బారికేడ్ ఫెయిల్ కావటంతో ఇసుక, నీరు ఉధృతంగా వచ్చి ఆ ధాటికి కొట్టుకుపోయి ఉంటాడా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమీపంలో ఉన్న ఇసుక మేటల్లో గాలింపు చేపడుతున్నారు. -
భూగర్భ గనులపై సింగరేణి దృష్టి
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయూ గనులు నష్టాల్లో ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 34 భూ గర్భ గనులు ఉన్నాయి. వాటిలో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూయస్ మైనర్ వంటి భారీ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల వినియోగం ఎక్కువగా ఉండటం, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం ఈ పరిస్థితులకు కారణంగా యూజమాన్యం అంచనా వేసింది. భూ గర్భ గనిలో సగటున ఒక టన్నుబొగ్గు ఉత్పత్తికి రూ.4,071 ఖర్చవుతుండగా విక్రయించేది రూ.2,419లకు. దీనినిబట్టి చూస్తే టన్నుకు రూ.1,652 నష్టం వాటిల్లుతోంది. ఈ ఆర్థిక సం వత్సరంలో డిసెంబర్ వరకు భూగర్భ గనులపై రూ.1,151 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ గనుల్లో ఉన్న పరిస్థితిని మార్చేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. ఇప్పటికే మల్టీ డిపార్ట్మెంట్ టీం పేరు తో ఫిబ్రవరి 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని ఏరియాల్లోని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులకు అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిం చి దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. భూగర్భ గనుల్లో ఉత్పాదక స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక్క శాతం పెరిగినా నష్టంలో రూ.26.33 కోట్లు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌కాస్టు గనుల్లో నూ షావెల్స్ వినియోగం ఒక్కశాతం పెరిగినా రూ.8.5 కోట్ల నష్టం నుంచి బయటపడవచ్చు. కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు పనివిధానాన్ని మెరుగుపర్చుకుని అవసరం మేరకు కృషి చేయూలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఉత్పత్తిని పెంచేందుకు భూగర్భ గనుల్లో ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. భూగర్భ గని కార్మికులు, మెషనరీ షిఫ్టు కార్మికులు రోజుకు కనీసం ఆరు గంటలు పనికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కార్మికులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోవాలని, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎండీ శ్రీధర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణిలో భూగర్భ గనుల ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునే చర్యలకు యాజమాన్యం పూనుకుంది.