కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థలోని భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయూ గనులు నష్టాల్లో ఉన్నాయి. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 34 భూ గర్భ గనులు ఉన్నాయి. వాటిలో ఎల్‌హెచ్‌డీ, ఎస్‌డీఎల్, కంటిన్యూయస్ మైనర్ వంటి భారీ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల వినియోగం ఎక్కువగా ఉండటం, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం ఈ పరిస్థితులకు కారణంగా యూజమాన్యం అంచనా వేసింది.
భూ గర్భ గనిలో సగటున ఒక టన్నుబొగ్గు ఉత్పత్తికి రూ.4,071 ఖర్చవుతుండగా విక్రయించేది రూ.2,419లకు. దీనినిబట్టి చూస్తే టన్నుకు రూ.1,652 నష్టం వాటిల్లుతోంది. ఈ ఆర్థిక సం వత్సరంలో డిసెంబర్ వరకు భూగర్భ గనులపై రూ.1,151 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూగర్భ గనుల్లో ఉన్న పరిస్థితిని మార్చేందుకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు రూపొం దిస్తున్నారు.
ఇప్పటికే మల్టీ డిపార్ట్‌మెంట్ టీం పేరు తో ఫిబ్రవరి 12 నుంచి 18వ తేదీ వరకు అన్ని ఏరియాల్లోని గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద కార్మికులకు అవగాహన కల్పించారు. ఉత్పత్తి, ఉత్పాదకతల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిం చి దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ల ద్వారా వివరించారు. భూగర్భ గనుల్లో ఉత్పాదక స్థాయి ప్రస్తుతం ఉన్నదానికంటే ఒక్క శాతం పెరిగినా నష్టంలో రూ.26.33 కోట్లు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఓపెన్‌కాస్టు గనుల్లో నూ షావెల్స్ వినియోగం ఒక్కశాతం పెరిగినా రూ.8.5 కోట్ల నష్టం నుంచి బయటపడవచ్చు. కార్మికులు, సూపర్‌వైజర్లు, అధికారులు పనివిధానాన్ని మెరుగుపర్చుకుని అవసరం మేరకు కృషి చేయూలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఉత్పత్తిని పెంచేందుకు భూగర్భ గనుల్లో ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.
భూగర్భ గని కార్మికులు, మెషనరీ షిఫ్టు కార్మికులు రోజుకు కనీసం ఆరు గంటలు పనికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కార్మికులు గైర్హాజరు శాతాన్ని తగ్గించుకోవాలని, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోవాలని సీఎండీ శ్రీధర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా సింగరేణిలో భూగర్భ గనుల ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునే చర్యలకు యాజమాన్యం పూనుకుంది.
భూగర్భ గనులపై సింగరేణి దృష్టి
Published Thu, Mar 5 2015 2:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement