► బొగ్గు ఉత్పత్తిలో దూసుకుపోతున్న సింగరేణి
► మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు
► శ్రీరాంపూర్, బెల్లంపల్లి డివిజన్లు ముందంజ
► అట్టడుగున మందమర్రి
శ్రీరాంపూర్ : ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి తమ లక్ష్యానికి చేరువలో ఉంది. మూడు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో మిగతా లక్ష్యాన్ని కూడా పూర్తి చేసి వంత శాతం సాధించేలా ముందుకు కదులుతున్నారు. సింగరేణి చరిత్రలో కంపెనీ వ్యాప్తంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించారు. కాగా.. ఆదివారం నాటికి 59.59 మిలియన్ టన్నులు సాధించడం విశేషం. మరో మూడు రోజుల్లో 4 లక్షల 40 వేల టన్నుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.
సోమవారం, మంగళవారాల ఉత్పత్తితో 100 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన రెండు రోజుల ముందే కంపెనీ వార్షిక లక్ష్యం సాధించే అవకాశాలూ లేకపోలేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్, బె ల్లంపల్లి డివిజన్‌లు 100 శాతం ఉత్పత్తి లక్ష్యాలను నమోదు చేసుకుంటుండగా.. మందమర్రి మాత్రం చాలా వెనుకడి ఉంది.
డివిజన్ల వారీగా..
బెల్లంపల్లి డివిజన్‌లో మొత్తం 3 ఓసీపీలు, ఒక భూగర్భ గని ఉంది. ఇందులో ఈ నెల 31 నాటికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 62.60 లక్షల టన్నులు ఉండగా ఈ నెల 27 నాటికి 64.12 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 104 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకొంది. దీంతో రీజియన్‌లోనే వార్షిక ఉత్పత్తి ముందే సాధించిన డివిజన్‌గా నిలిచింది. శ్రీరాంపూర్ డివిజన్‌ను పరిశీలిస్తే అధిక భూగర్భ గనులు ఉన్నాయి. మొత్తం 9 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఈ డివిజన్‌లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 53.95 లక్షల టన్నులు. ఇందులో 53.51 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. సోమవారం, మంగళవారం ఉత్పత్తి కలిపితే 100 శాతం ఉత్పత్తి నమోదు కానుంది. దీంతో ఇది కూడా ముందస్తుగా ఉత్పత్తి సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఆర్కే న్యూటెక్‌లో షార్ట్‌వాల్ టె క్నాలజీ నిలిచిపోకుంటే వారం ముందే 100 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకునే అవకాశం ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మందమర్రి డివిజన్ బొగ్గు ఉత్పత్తిలో అధ్వానంగా ఉంది. ఈ డివిజన్‌లో మొత్తం 6 భూగర్భ గనులు, ఒక ఓసీపీ ఉంది. ఏటా ఉత్పత్తి లక్ష్య సాధనలో ఈ డివిజన్ వెనుకంజలోనే ఉంటోంది. ఈ సారి కూడా అదేబాటన ఉంది. వార్షిక ఉత్పత్తి లక్ష్యం 27 లక్షల టన్నులు కాగా.. ఇప్పటికి 16.47 లక్షలు మాత్రమే సాధించింది. దీంతో 62 శాతం ఉత్పత్తిని మాత్రమే నమోదు చేసుకొంది. కంపెనీలోనే అన్ని డివిజన్ల కంటే ఉత్పత్తి లక్ష్యంలో వెనుకబడిన డివిజన్‌గా మందమర్రి నిలిచింది.
లక్ష్యానికి చేరువలో..
Published Tue, Mar 29 2016 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement