గనిలో కార్మికుడి గల్లంతు.. దొరకని ఆచూకీ | Singareni Employee Missing In Underground Mine At Bhupalpally | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 8:48 AM | Last Updated on Fri, Dec 28 2018 8:54 AM

Singareni Employee Missing In Underground Mine At Bhupalpally - Sakshi

గనిలోని వెళ్లేందుకు వచ్చిన రెస్క్యూ సిబ్బంది 

సాక్షి, కోల్‌బెల్ట్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో సపోర్ట్‌మెన్‌ కార్మికుడు రాయుడు సత్యనారాయణ గల్లంతై 24 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. దీంతో గని వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బుధవారం మొదటి షిఫ్టు విధులకు హాజరైన సత్యనారాయణ మధ్యాహ్నం నుంచి కనిపించక పోవడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ, మైనింగ్‌ స్టాఫ్‌ బృందాలు గనిలో గాలిస్తున్నాయి. సింగరేణికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు గని వద్దే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గని ఆవరణలోకి వందలాది మంది కార్మికులు చేరుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం ఉదయం అక్కడికి చేరుకుని సింగరేణి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గనిలో తప్పిపోయిన కార్మికు డి కుటుంబ సభ్యులు గని సమీపంలోనే             బిక్కుబిక్కు మంటూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.

అసలేం జరిగింది..
కేటీకే–1 గనిలోని 36వ డిప్‌ 3వ సీం ఎస్‌–7 ప్యానల్‌ వద్ద 11 లెవల్‌లో బారికేడ్‌ వద్ద బుధవారం మొదటి షిఫ్టు విధులకు సపోర్టుమెన్‌ రాయుడు సత్యనారాయణ హాజరయ్యాడు. ఈక్రమంలో రిలే–డి కి చెందిన ఓవర్‌మెన్‌ 35 డిప్‌లోని ట్రావెలింగ్‌ రోడ్‌లో నీరు వస్తుంది.. అదుపు చేయాలని సత్యనారాయణకు ఆదేశాలు ఇవ్వటంతో ఆయన అక్కడికి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి సత్యనారాయణ ఆచూకీ కనిపించకపోవడంతో గని అధికారులకు సమాచారం అందించగా రెస్క్యూ, మైనింగ్‌ స్టాఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి పని ప్రదేశాల్లో వెతికారు. 11వ లెవల్‌ నుంచి 19 లెవల్‌ వరకు ఇసుకలో చిక్కుకున్నాడనే అనుమానంతో ఎస్‌డీఎల్‌ యంత్రాలతో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. 

గాలింపు ముమ్మరం..
రామగుండం రిజియన్‌ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, జీఎం ఎస్టేట్‌ ప్రేంకుమార్, ఏరియా జనరల్‌ మేనేజర్‌ కె.గురువయ్య ఆధ్వర్యంలో గురువారం గాలింపు ముమ్మరం చేశారు. మందమర్రి, గోదావరిఖనికి చెందిన రెండు, భూపాలపల్లికి చెందిన నాలుగు రెస్క్యూ బృందాలకు చెందిన 30 మంది, మైనింగ్‌ స్టాఫ్‌తో ఏర్పాటు చేసిన మరో 30 మంది గనిలోని పని స్థలాలకు వెళ్లి వెతుకుతున్నారు. గాలింపు చర్యలను ఎస్‌ఓటు జీఎం పద్మనాభరెడ్డి, గ్రూప్‌ ఆఫ్‌ ఏజెంట్‌ టీవీ.రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ బచ్చ రవీందర్, సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుకర్, డీవైజీఎం రాజేంద్రకుమార్, గని మేనేజర్‌ క్రిష్ణప్రసాద్‌ పర్యవేక్షించారు.
గని వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న జీఎం గురువయ్య

20 లెవల్‌ వద్ద క్యాప్‌లైటు లభ్యం..
గనిలోని 20 లెవల్‌ వద్ద సత్యనారాయణకు చెందిన క్యాప్‌లైటు గాలింపు చేపట్టిన రెస్క్యూ బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. 11వ లెవల్‌ వద్ద బారికేడ్‌ ఫెయిల్‌ కావటంతో ఇసుక, నీరు ఉధృతంగా వచ్చి ఆ ధాటికి కొట్టుకుపోయి ఉంటాడా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమీపంలో ఉన్న ఇసుక మేటల్లో గాలింపు చేపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement