unetaid Forum of Bank Unions
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్
ఖమ్మం గాంధీచౌక్ : జాతీయ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం చేపట్టిన సమ్మె జిల్లాలో విజయవంతమైంది. వేతన సవరణ డిమాండ్‌తో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు ఈ మేరకు నిరసన తెలిపారు. 2012 నవంబర్ నుంచి కొత్త వేతన విధానాన్ని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల సమ్మెతో జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు స్తంభించాయి. సమ్మె కారణంగా జిల్లాలోని ప్రధాన సంస్థలైన సింగరేణి, భద్రాచలం పేపర్ బోర్డు, హెవీ వాటర్ ప్లాంట్, కేటీపీఎస్ తదితర పరిశ్రమలతో పాటు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు కొంత మేరకు ఇబ్బందులు పడ్డాయి. తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్‌బియూ వేతన సవరణపై ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. 25 శాతం వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 10 నుంచి 11 శాతం మాత్రమే పెంచేందుకు ముందుకొచ్చింది. దీంతో యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. జిల్లాలోని సుమారు 50 జాతీయ బ్యాంకుల్లో పని చేసే 300 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎస్బీహెచ్ ఎదుట ఉద్యోగులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా నాయకులు నందన్, చంద్రశేఖర్, నర్సింగరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉందన్నారు. బ్యాంకులు లక్షల, కోట్ల రూపాయల లాభాలను అర్జిస్తున్నా ఉద్యోగుల వేతనాలు విషయంలో ప్రభుత్వం అనుకూలంగా లేకపోవటం దురదృష్టకరమని అన్నారు. కార్పొరేట్ రంగాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను రాయితీలుగా ఇస్తోందని, ఆయా సంస్థలు బాకీలు కూడా సక్రమంగా చెల్లించటం లేదని అన్నారు. 25 శాతం వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు మాత్రమే భారమవుతుందన్నారు. ఈ సమ్మెకు సీపీఎం అనుబంధ సీఐటీయూ. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు కె.నర్సింహరావు, ఏఐటియూసీ నాయకులు సింగు నర్సింగరావులు ఉద్యోగుల సమ్మెలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. -
వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి
యూఎఫ్‌బీయూ వరంగల్ కన్వీనర్ సత్యనారాయణ సుబేదారి : పదో వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) వరంగల్ కన్వీనర్ లంకిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు హన్మకొండలో మంగళవారం భారీ ర్యాలీ తీసి, ధర్నా చేపట్టారు. హన్మకొండ నుంచి పెట్రోల్ పంపు, అంబేద్కర్ విగ్రహం, ఎల్ఐసీ భవన్, కాళోజీ జంక్షన్, అదాలత్, తెలంగాణ అమరవీరుల స్తూపం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వెయ్యికిపైగా ఉద్యోగులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ తీశారు. మహిళా ఉద్యోగినులు అధిక సంఖ్యలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ) మొండి వైఖరిని వీడాలని, ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను వీడాలని, బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) వరంగల్ కన్వీనర్ లంకిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు 12 గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలన్నారు. అనంతరం కలెక్టర్ కిషన్ వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీజీవీబీ రీజినల్ సెక్రటరీ టి.రాజయ్య, జనరల్ సెక్రటరీ కె.బిక్షమయ్య, ఎస్బీఐ వేలేరు రీజినల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్, ఎస్బీహెచ్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎం.సామ్యుల్, కెనరా బ్యాంక్ యూనియన్ చైర్మన్ ఎం.వెంకటేశ్వర్లు, స్టేట్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, జి.బుచ్చయ్య, జిల్లా సెక్రటరీ కె.వెంగ య్య, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధి సుబ్బా రావు, ఐఓబీ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ డి.వెంకటేశ్వర్లు, ఐఎన్జీ బ్యాంక్ కాజీపేట బ్రాంచి అసిస్టెంట్ సెక్రటరీ బి.కృష్ణమోహన్ పాల్గొన్నారు.