బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్ | Bank employees strike was success | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్

Published Wed, Dec 3 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

Bank employees strike was success

ఖమ్మం గాంధీచౌక్ : జాతీయ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం చేపట్టిన సమ్మె జిల్లాలో విజయవంతమైంది. వేతన సవరణ డిమాండ్‌తో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు ఈ మేరకు నిరసన తెలిపారు. 2012 నవంబర్ నుంచి కొత్త వేతన విధానాన్ని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల సమ్మెతో జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగా  లావాదేవీలు స్తంభించాయి.

సమ్మె కారణంగా జిల్లాలోని ప్రధాన సంస్థలైన సింగరేణి, భద్రాచలం పేపర్ బోర్డు, హెవీ వాటర్ ప్లాంట్, కేటీపీఎస్ తదితర పరిశ్రమలతో పాటు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు కొంత మేరకు ఇబ్బందులు పడ్డాయి.  తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్‌బియూ వేతన సవరణపై ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. 25 శాతం వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 10 నుంచి 11 శాతం మాత్రమే పెంచేందుకు ముందుకొచ్చింది. దీంతో యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. జిల్లాలోని సుమారు 50 జాతీయ బ్యాంకుల్లో పని చేసే 300 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.

నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎస్‌బీహెచ్ ఎదుట ఉద్యోగులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా నాయకులు నందన్, చంద్రశేఖర్, నర్సింగరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉందన్నారు. బ్యాంకులు లక్షల, కోట్ల రూపాయల లాభాలను అర్జిస్తున్నా ఉద్యోగుల వేతనాలు విషయంలో ప్రభుత్వం అనుకూలంగా లేకపోవటం దురదృష్టకరమని అన్నారు.

కార్పొరేట్ రంగాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను రాయితీలుగా ఇస్తోందని, ఆయా సంస్థలు బాకీలు కూడా సక్రమంగా చెల్లించటం లేదని అన్నారు. 25 శాతం వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు మాత్రమే భారమవుతుందన్నారు. ఈ సమ్మెకు సీపీఎం అనుబంధ సీఐటీయూ. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు కె.నర్సింహరావు, ఏఐటియూసీ నాయకులు సింగు నర్సింగరావులు ఉద్యోగుల సమ్మెలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement