Union minister Babul Supriyo
-
ఐపీఎస్‌పై దాడి.. కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్!
కోల్‌కతా: 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. ఐపీఎస్ అధికారిపై దాడి చేశారంటూ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన అసన్సోల్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి.. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. అయితే, తన నియోజకవర్గం పరిధిలోని అసన్సోల్ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ పర్యటించాలని కేంద్రమంత్రి బాబుల్ ప్రయత్నించారు. ఇందుకు భద్రతా సిబ్బంది అడ్డుపడటంతో మరో మార్గం ద్వారా కల్యాణ్‌పూర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన బాబుల్ ఐపీఎస్ అధికారి రూపేశ్ కుమార్‌పై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీంతో 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. విధినిర్వహణలో ఉన్న ఐపీఎస్‌పై దాడి చేశారని, అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసన్సోల్లో పర్యటిస్తున్న సమయంలో పోలీసులే తనపై దాడి చేశారని, దీనిపై తాను కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేస్తానని తెలిపారు. -
ఫొటో సాక్షిగా కేంద్రమంత్రి దొరికేశారు
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సోషల్ మీడియా సాక్షిగా పొరపాటు చేసి నెటిజెన్లకు అడ్డంగా దొరికిపోయారు. చివరకు పొరపాటు తెలుసుకున్న మంత్రి.. తన స్నేహితుడిపై నెపం వేసి తప్పించుకున్నారు. రాజ్‌కోట్‌లో కొత్తగా నిర్మించిన బస్టాండ్ ఇదేనంటూ సుప్రియో వేరే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది లండన్లోనో లేదా న్యూయార్క్‌లోనో ఉన్న ఎయిర్పోర్ట్ కాదు.. గుజరాత్‌లోని రాజకోట్‌లో ప్రారంభించిన కొత్త బస్టాండు అంటూ మంత్రి ట్వీట్ చేస్తూ మూడు ఫొటోలను పోస్ట్ చేశారు. నిజమేనని భావించి కొందరు ప్రముఖులు కూడా వీటిని షేర్ చేశారు. అయితే మంత్రి నిర్వాకంపై నెటిజెన్లు సెటైర్లు వేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. రాజ్‌కోట్‌లోని అసలైన బస్టాండ్ ఇదేనని, రాజ్‌కోట్ ఇప్పటిలాగే ఉంటుందని కామెంట్ చేస్తూ ఓ నెటిజెన్ అసలైన ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో పొరపాటు తెలుసుకున్న మంత్రి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. చిన్ననాటి క్లాస్మేట్ ఈ ఫొటోలను పంపాడని, తొందరపాటులో తాను వీటిని పోస్ట్ చేశానని వివరణ ఇచ్చారు. అయితే బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నిజాన్ని నిర్ధారించుకోకుండా ఎలా పోస్ట్ చేస్తారంటూ నెటిజెన్లు విమర్శించారు. -
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు వారెంట్
కోల్‌కతా : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు వారెంట్ జారీ అయింది. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఆయన కోర్టుకు గైర్హాజరు కావడంతో ఈ వారెంట్ జారీ అయింది. కాగా కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కోల్‌కోతా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జనవరిలో జరిగిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహిళల మనోభావాలను కించపరిచేలా బాబుల్ సుప్రియో వ్యాఖ్యలు చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మైత్రా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపట్ల కేంద్రమంత్రి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె జనవరి 4వ తేదీన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేసి అలిపోరీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అలాగే టీవీ చర్చ కార్యక్రమం ఫుటేజ్ కూడా కోర్టుకు సమర్పించారు. అయితే అంతకు ముందు దీనిపై కేంద్రమంత్రిని పోలీసులు మూడుసార్లు వివరణ కోరినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని సమాచారం. మరోవైపు దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ 'వాళ్లు ఏం చేసుకుంటారో అది చేసుకోనివ్వండి. దీనిపై నేను చెప్పేది ఏమీ లేదు' అని అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.