రెండు నెలల్లో ‘కోలారు’ గనులు పునః ప్రారంభం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు బంగారు గనులను పునఃప్రారంభించడానికి రెండు నెలల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కేహెచ్. మునియప్ప వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గనులను పునఃప్రారంభిస్తామన్నారు. దీనిపై గురువారం ఢిల్లీలో గనుల శాఖ మంత్రితో సుదీర్ఘంగా చర్చించానని తెలిపారు. నగరంలోని హోటల్లో ఇండో అరబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్ పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
గనుల పునఃప్రారంభానికి ఎదురైన ఆటంకాలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కోలారులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించే విషయమై మరో వారంలో నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అంతకు ముందు ఆయన వర్క్‌షాపులో మాట్లాడుతూ.. అరబ్ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడులు పెట్టదలిస్తే, కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.
భారత్-అరబ్ సంబంధాలు ఈనాటిది కాదని, అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోందని తెలిపారు. అనేక రంగాల్లో ఇరు దేశాలు చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. మున్ముందు కూడా ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా 12వ పంచ వర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమలకు రూ.25 వేల కోట్లు కేటాయించారని ఆయన వెల్లడించారు. ప్రారంభోత్సవంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన రవి శంకర్ గురూజీ ప్రభృతులు పాల్గొన్నారు.