వర్సిటీ కాంట్రాక్టు బోధకుల ఉద్యమబాట
ఉద్యోగాల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ బోధకులు ఉద్యమబాట పట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,639 మంది అసిస్టెంట్ ప్రొఫెస ర్లు, 482 మంది పార్ట్‌టైమ్ కాంట్రాక్టు లెక్చర ర్లు రెండు రోజులుగా ఆందోళనల్లో పాల్గొం టున్నారు. మూడు నెలల క్రితమే వీరు ఈ డిమాండ్లపై ఆందోళన చేపట్టగా.. ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి చొరవ తీసుకుని.. సంఘాల నేతలతో చర్చించి ఆందోళనకు తాత్కాలికంగా చెక్ పెట్టారు. దీంతో కొంత కాలంగా ఉద్యమం సద్దుమణిగింది. తాజాగా మరోమారు విధుల బహిష్కరణకు దిగడం తో వర్సిటీల్లో గందరగోళం నెలకొంది.
కమిటీ నివేదిక రాకముందే..
వర్సిటీల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీక రణపై ప్రభుత్వం ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో కమిటీ సభ్యులు వర్సిటీల్లో పరిస్థితులపై పరిశీలన చేపట్టారు. అయితే ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని చర్చల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆలోపు ఎలాంటి నియామకాలు చేపట్టమని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టు బోధకులు ఆందోళన వీడి విధుల్లో చేరారు. తాజాగా వర్సిటీల్లో వెయ్యి పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో కాంట్రాక్టు బోధకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక రాకముందే నియామకాల ప్రక్రియ ఏలా చేస్తారంటూ ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వేతనాలు పెంచే అం శాన్ని మాత్రమే పరిశీలిం చాలని కమిటీ సూచించి నట్లు సమాచారం. అయితే పూర్తిస్థాయి నివేదిక ఇంకా సమర్పించాల్సి ఉంది.
ఆరు డిమాండ్లతో ఆందోళనలు...
కాంట్రాక్టు బోధకులు ఆరు డిమాండ్లతో ఆం దోళన చేపట్టారు. టీయూటీఏసీ, ఓయూసీ ఏపీ, ఓయూటీఏసీ, టీయూపీటీటీఏ సం ఘాలు సంయుక్తంగా నిరసనలు చేపడుతు న్నాయి. ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్ కాగా, యూజీసీ నిబంధనల ప్రకారం వర్క్‌లోడ్ ఆధారంగా పదోన్నతులు, ఉద్యోగ భద్రత, సుప్రీం ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఐదేళ్ల తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా పరిగణించాలనే డిమాండ్లతో ఉద్యమాన్ని చేపట్టారు. డిమాండ్లు సాధిం చుకునే వరకు ఉద్యమిస్తామని బోధకులు ప్రకటిస్తుండడంతో బోధన ఎలా సాగుతుం దోనని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు.