వర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు భారీగా వేతనాలు
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం స్థిరీకరించింది. వేతన స్థిరీకరణ, ఉద్యోగ భద్రత అంశంపై కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ లెక్చరర్లు కొన్నేళ్లుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సమ్మె సైతం చేపట్టారు. దీంతో స్పందించిన ఉన్నత విద్యాశాఖ.. గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. తాజాగా వేతన స్థిరీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,562 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. వీరితోపాటు పలువురు పార్ట్‌టైమ్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ సీనియారిటీ ప్రాతిపదికన వేర్వేరుగా గౌరవ వేతనాలను నిర్ణయించారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు గౌరవమిది: యూటీఏసీటీఎస్
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల వేతన పెంపుపై యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్–తెలంగాణ స్టేట్ (యూటీఏసీటీఎస్) హర్షం ప్రకటించింది. వేతనాల పెంపుతో కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల గౌరవం పెరిగిందని పేర్కొంటూ.. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పరశురామ్, బి.నిరంజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలను స్థిరీకరించినందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంట్రాక్టు అధ్యాపకులకు..
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా(ఇంజనీరింగ్ స్ట్రీమ్) లేని అధ్యాపకులకు నెలకు రూ.21,600 ఇస్తుండగా.. ఈ వేతనాలను 75శాతం పెంచాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. దీంతో వేతనం రూ.37,800కు పెరగనుంది.
నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా (ఇంజనీరింగ్ స్ట్రీమ్) అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.24,840 చొప్పున ఇస్తుండగా.. 75 శాతం పెంపుతో రూ.43,470 చొప్పున చెల్లిస్తారు.
ఈ అర్హతలు ఉన్న/లేని లెక్చరర్లందరికీ కూడా అదనంగా సర్వీసు, సీనియారిటీ ఆధారంగా ఏడాదికి 3 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అంటే అర్హతలు లేని వారికి ఏడాది సర్వీసుతో రూ.38,930 వేతనం అందుతుంది. అర్హతలున్న వారికి ఏడాది సర్వీసుతో రూ.44,700 వేతనం వస్తుంది. ఇలా ఏటా సీనియారిటీ పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది.
ఇక అదనపు అర్హతలున్న అధ్యాపకులకు ఏటా ఒకసారి రూ.3 వేలు చొప్పున అందజేస్తారు.
పార్ట్‌టైమ్ అధ్యాపకులకు..
ఇక ఉస్మానియా వర్సిటీలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ అధ్యాపకుల్లో నెట్, సెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా లేనివారికి ప్రస్తుతం థియరీ క్లాసుకు రూ.475 చొప్పున, గంట పాటు ప్రాక్టికల్ క్లాసుకు రూ.220 చొప్పున గౌరవ వేతనంగా ఇస్తున్నారు. కమిటీ ప్రతిపాదనల మేరకు.. థియరీ క్లాసుకు రూ.600 చొప్పున, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.300 చొప్పున ఇవ్వనున్నారు. అదే అర్హతలున్న పార్ట్‌టైమ్ అధ్యాపకులకు థియరీ క్లాసుకు రూ.700, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.350 చొప్పున అందజేస్తారు.