గ్రీన్‌కార్డు ఆశలు తీరే మార్గం.. భారతీయ అమెరికన్లకు శుభవార్త!
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయ అమెరికన్లకు శుభవార్త. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న 2.30 లక్షలకు పైగా గ్రీన్‌కార్డులను స్వాధీనం చేసుకుని, పునరి్వనియోగించాలన్న సిఫారసుపై అధ్యక్షుడి సలహా మండలి ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా, మరింత మంది గ్రీన్‌కార్డులను అందుకునేందుకు వీలు ఏర్పడింది. దీని ప్రకారం..ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు అదనంగా 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటిని జారీ చేస్తారని ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ భుటోరియా చెప్పారు.
అధ్యక్షుడు బైడెన్‌కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో భుటోరియా సభ్యుడు. ఇందుకు సంబంధించిన సిఫారసులను మండలికి గురువారం అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో వలసదారులకు అందజేసే శాశ్వత నివాస పత్రం. ఉపయోగంలో లేని గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, మున్ముందు గ్రీన్‌కార్డుల వృథాను అరికట్టేందుకు పలు సిఫారసులను చేశామన్నారు. వీటి అమలుతో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతో ఊరటనిస్తుందని చెప్పారు. తమ కమిషన్ సిఫారసులకు ఆమోదం తెలిపిన బైడెన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కుటుంబ, ఉద్యోగ ప్రాతిపదికన వలసదారులకు ఏటా నిరీ్ణత సంఖ్యలో గ్రీన్‌కార్డులను జారీ చేసే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కి కాంగ్రెస్ ఇస్తుంటుంది. అయితే, పరిపాలనా పరమైన జాప్యంతో జారీ అయిన గ్రీన్‌కార్డుల్లో కొన్ని నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. అనేక ఏళ్లుగా ఇలా కార్డులు లక్షలుగా పేరుకుపోయాయని భుటోరియా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు చర్యలను తాము సూచించినట్లు వెల్లడించారు. అందులో ఒకటి...1992 నుంచి ఉపయోగంలో గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
ఏటా ఇచ్చే 1.40 లక్షల గ్రీన్‌కార్డులకు తోడుగా స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో ఏటా కొన్నిటినీ జారీ చేయాలి. రెండోది..ఆ ఆర్థిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోయినప్పటికీ, అన్ని గ్రీన్ కార్డ్‌లు వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావడం. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్‌లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందస్తుగా వర్తింపజేయడం’అని ఆయన వివరించారు.
ఈ సిఫారసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉండే గ్రీన్‌కార్డుల ప్రభావం ముఖ్యంగా భారతీయ అమెరికన్లు, ఫిలిపినో అమెరికన్లు, చైనీస్ అమెరికన్ల కుటుంబాలపైనే ఉంటుందని చెప్పారు. గ్రీన్‌కార్డుల కొరత ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే హెచ్–1బీ వీసాదారులపై ఉంటుందని, వారి పిల్లల వలస హోదాపైనా పడుతోందన్నారు. 2020 గణాంకాల ప్రకారం 42 లక్షల కుటుంబాలు సగటున ఆరేళ్లుగా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. భారతీయ ఐటీ నిపుణులు గ్రీన్‌కార్డు కోసం సగటున దశాబ్ద కాలంపాటు ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితులున్నాయి.