ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
– దిష్టిబొమ్మల్లా తయారైన సబ్‌కంట్రోల్ కార్యాలయాలు
అనంతపురం సెంట్రల్ : ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ కార్యాలయాలు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ఇటీవల నేరసమీక్షా సమావేశంలో ఎస్పీ రాజశేఖరబాబు స్వయంగా సబ్‌కంట్రోల్ కార్యాలయాలు తెరవాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాలు అదుపు చేసేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్‌సబ్ కంట్రోల్ కార్యాలయాలు నిర్మించారు. పాతూరులో గాంధీ విగ్రహం సర్కిల్, టవర్‌క్లాక్, కలెక్టరేట్‌కు సమీపంలో సర్ థామస్ మన్రో విగ్రహం వద్ద, బళ్లారి బైపాస్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఈ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఓ కానిస్టేబుల్ నియమించి నిత్యం వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు శాంతిభద్రతల పరిరక్షణ చేపట్టేందుకు వీటిని వినియోగించాలి. కానీ కొన్ని నెలల నుంచి సబ్‌కంట్రోల్ కార్యాలయాలు తలుపులు తెరుచుకున్న పాపాన పోలేదు. దుమ్ము, చెత్తా, చెదారంతో అవి దీనావస్థకు చేరుతున్నాయి. టవర్‌క్లాక్ కూడలిలో రాజకీయనాయకుల ప్లెక్సీ కట్టుకునేందుకు సబ్‌కంట్రోల్ రూం ఉపయుక్తంగా మారుతోంది. అక్కడ పోలీసులకు సంబంధించి ఓ ఆఫీసు ఉందని ప్రజలకు కనిపించని రీతిలో కట్టేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడ గాడిలో పడుతుంది అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.