రాజీవ్ శుక్లా అవుట్!
లక్నో: లోధా కమిటీ సిఫారుసులను అమలు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) నడుంబిగించింది. దీనిలో భాగంగా యూపీసీఏ సెక్రటరీ పదవికి రాజీవ్ శుక్లా తాజాగా రాజీనామా చేశారు. దాంతో పాటు మరో ఐదుగురు ఆఫీస్ బేరర్లు తమ తమ పదవులకు రాజీనామా చేస్తూ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీరిలో రాజీవ్ శుక్లా, బీసీ జైన్(అకౌంట్స్ జాయింట్ సెక్రటరీ)లు ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోవడంతోవారి హోదాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరొకవైపు 70 ఏళ్ల పైబడిన నలుగురు యూపీసీఏ సభ్యులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు. ఇలా తప్పుకున్న వారిలో కేఎన్ టాండన్(ట్రెజరర్), సుహబ్ అహ్మద్(జాయింట్ సెక్రటరీ)లతో పాటు ఉపాధ్యక్షులు తాహిర్ హసన్, మదన్ మోహన్ మిశ్రాలు తమ పదవులకు వీడ్కోలు చెప్పారు.
ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన లోధా సిఫారుసులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు యూపీసీఏ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. తదుపరి ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు శుక్లా స్పష్టం చేశారు.