Urdu univeristy
-
ఉర్దూ వర్శిటీ నిర్మాణంలో నత్తతో పోటీ !
సాక్షి, కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఉర్దూ విశ్వవిద్యాలయ సొంత భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిర్మాణంలో జాప్యం జరిగేకొద్దీ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగనుంది. ఈ ప్రాంతంలో ఎంఎస్సీ జువాలజీ కోర్సులకు బాగా డిమాండ్ ఉంది. గత విద్యా సంవత్సరంలో అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు వారిని చేర్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు భవనాల్లో జువాలజీ కోర్సుకు అవసరమైన సదుపాయాలు లేవు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సైన్సెస్ కోర్సులతోనే విద్యార్థులు సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేకమైన క్రీడా మైదానం కూడా లేదు. విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణను క్రీడా మైదానంగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు నెలకు రూ.1.30 లక్షల సొమ్ము అద్దె చెల్లిస్తున్నా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల నిర్మాణం పూర్తయితే తప్పా విద్యార్థుల కష్టాలు తీరే మార్గం దరిదాపుల్లో కనిపించడం లేదు. నత్తనడకన పనులు ఈ విశ్వ విద్యాలయానికి ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా కళాశాల వ్యవస్థాపకుడు డాక్టర్ అబ్దుల్‌హక్ పేరు పెట్టారు. దీనికి సొంత భవనాలను పద్దెనిమిదవ జాతీయ రహదారిలో రాక్ గార్డెన్ ఎదురుగా 144 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మిస్తున్నారు. 2015 నవంబర్ 9న శంకుస్థాపన జరిగింది. నాలుగేళ్లు కావస్తున్నా పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం గమనార్హం. పనులు నత్తనడకన సాగుతుండటంతో భవనాలు వచ్చే విద్యా సంవత్సరానికైనా సిద్ధమవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అకాడమిక్ బ్లాక్‌ను యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.7.92 కోట్ల నిధులతో నిర్మిస్తున్నారు. నిర్మాణం రూఫ్ దశలో ఉంది. అలాగే 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 6.4 కోట్ల వ్యయంతో లేడీస్ హాస్టల్ బ్లాక్ నిర్మాణం కొనసాగుతుంది. దీన్ని జీ+2 తరహాలో నిర్మించాల్సి ఉంది. వర్సిటీలో ఇంటర్నల్ రోడ్డు అయితే నిర్మాణం ఇంకా బేస్మట్టం దశలోనే ఉంది. అకాడమిక్ బ్లాక్, లేడీస్ హాస్టల్ పనులను హైదరాబాద్‌కు చెందిన ఆరో కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టారు. ఆ కంపెనీ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. సబ్‌కాంట్రాక్ట్ విధానం వల్లనే పనులు ఆలస్యమవుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. రూ. 2.4 కోట్ల వ్యయంతో యూనివర్సిటీలో ఆరు ఇంటర్నల్ రోడ్లు, డివైడర్ల నిర్మాణం చేపట్టారు. 2020, మే నాటికి భవనం పూర్తి చేసి విశ్వవిద్యాలయానికి అప్పగించాలనేది కాంట్రాక్టర్ ఒప్పందం. అదే జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనంలో తరగతులు ప్రారంభించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనంలో తరగతులు వచ్చేవిద్యాసంవత్సరం (2020–2021)లో తరగతులు కొత్త భవనంలో కొనసాగేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మే నెలలోనే పనులు పూర్తవుతాయి. భవనాన్ని కాంట్రాక్టర్ అప్పగించిన వెంటనే పరిపాలన, నిర్వహణ అక్కడే కొనసాగిస్తాం. కొత్త భవనంలో ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెడతాం. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరితే ఐదేళ్లలో ఎంఎస్సీ పూర్తవుతుంది. –ముజఫర్‌అలీ, వీసీ -
ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు?
కర్నూలు : జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారంటూ బోర్డు కమిటీ సభ్యులు, అధికారులపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాష సీరియస్ అయ్యారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు. స్థానిక మహ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా వక్ఫ్‌బోర్డు భూములు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని, అన్యాక్రాంతమైన భూములు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వార్షిక నివేదిక వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామన్నారు. పెళ్లికానుక పథకాన్ని వైఎస్ఆర్ దుల్హన్ పథకంగా మార్పుచేసి, పేద వధువులకు వారి పేరిట కాకుండా తల్లిదండ్రుల పేరిట చెక్కు పంపించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సాయం వస్తే అందులో దళారులకే రూ. 20 వేల దాకా ఖర్చయ్యేదని, కానీ నేడు నయాపైసా తగ్గకుండా రూ. లక్ష అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబ్బర్బాష తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ వర్సిటీలో అవినీతిపై విచారణ కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష స్పష్టం చేశారు. వర్సిటీకి వచ్చిన ఆయన దృష్టికి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముజఫర్ అలీ, కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు పలు సమస్యలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వర్సిటీ అద్దె భవనాల్లో కొనసాగడం బాధాకరమన్నారు. 2016లో వర్సిటీ ఏర్పాటయితే ఇంత వరకు సొంత భవనం నిర్మాణం కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణం ఏ ద«శలో ఉందని అడిగి తెలుసుకున్నారు. నిధులు లేక నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని వీసీ వెల్లడించారు. నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రికి చూపించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ తన భర్తకు పోస్టు ఇప్పించుకోవడానికే తమను తొలగించారని, రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేని విధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించిన రిజిస్ట్రార్ భర్తకు సెమిస్టర్‌కు రూ.1.20 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. వీసీ ముజఫర్ అలీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ సాహెదా అక్తర్లను కాంట్రాక్ట్ స్టాఫ్ సమస్య గురించి మంత్రి అడగ్గా.. ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఉస్మానియా కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి ఉస్మానియా కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష హామీ ఇచ్చారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన హాజిరా కాలేజీకి మున్సిపల్ అధికారులు రూ. లక్షల్లో పన్ను విధించారని కరస్పాండెంట్ అజ్రాజావేద్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. పన్ను మినహాయించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించారు. ప్రొటోకాల్ విస్మరణ డిప్యూటీ సీఎం పర్యటన విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉర్దూ వర్సిటీ ఉంది. అయితే.. అధికారులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంజాద్ బాష ఉర్దూ వర్సిటీకి ఉదయం 10.30 గంటలకే చేరుకోగా.. ఆయన వచ్చిన 15 నిమిషాల తరువాత సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు నింపాదిగా రావడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. -
అన్నీ మేడ్ ఇన్ ఇండియానే..
హైదరాబాద్: బారూద్, బందూక్, హెలికాప్టర్, జహాజ్ అన్నీ ప్రస్తుతం ‘మేడ్ ఇన్ ఇండియా’వే సైన్యంలో వాడుతున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహరాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇదీ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఎన్డీటీవీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ... బారూద్ నుంచి అన్నీ.. ఇంతకు ముందు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం విదేశాలు సైతం మన దేశానికి రావాల్సిన పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. మోదీ కేంద్రం పగ్గాలు చేపట్టాక మూడున్నరేళ్లలో మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న ఆలోచనలకు ప్రోత్సహమిస్తున్నారన్నారు. మనదేశంలోని యువతను ప్రోత్సహించడం ద్వారా మరింతగా ఉపాధి సౌకర్యం మెరుగుపర్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి ఐఏఎస్‌లు 52 మంది ఈ మూడేళ్లలో ముస్లింలు ఎంపికయ్యారన్నారు. అయితే దీనిపై గత ప్రభుత్వం లాగా పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ముద్రా స్కీమ్.. ఎంతో మంది చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఎంతో ఉపయుక్తమవుతోందన్నారు. విద్యార్థులు, యువతను ఉపా«ధి పొందేవారుగా కాకుండా ఉపాధి కల్పించేవారిగా ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా అన్నారు. దేశ్యాప్తంగా అన్ని నగరాల్లో పర్యటించి విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేందుకు బస్సు యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేశ్‌వాలా, జెట్‌సెట్‌గో స్టార్టప్ వ్యవస్థాపకురాలు కనికతేక్రివాల్, ఎంటర్ప్రెన్యూర్ రవిమంతా చర్చలో పాల్గొనగా మోడరేటర్‌గా ఎన్డీటీవీ యాంకర్ ఉమ వ్యవహరించారు. -
వివక్షకు సాక్ష్యమిదే !
‘కడపలో ఉర్దూ భాషాభిమానులు అధికంగా ఉన్నారు. పైగా జిల్లాలోని రాయచోటి, కడపతోపాటు పలు ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంది. వారి పిల్లల చదువు కోసం, ఉపాధి రీత్యా ఉర్దూ భాషను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి ప్రజలు టీడీపీకి పెద్దగా ఓట్లు వేయకపోయినా కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ - 2014 నవంబరు 8న రైల్వేకోడూరులో సీఎం హామి కడప జిల్లా ప్రజలు టీడీపీపై వివక్ష చూపినా మేము మాత్రం ప్రత్యేకంగా అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల ఉన్నత చదువుల కోసం ఉర్దూ యూనివర్సిటీని కడపలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మేమెక్కడా కూడా కడపపై వివక్ష చూపలేదు. - అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వ్యాఖ్య. సాక్షి, కడప : కడప ప్రజలపై తాము ఏమాత్రం వివక్ష చూపక పోయినా ప్రతిపక్షం గోల చేస్తోందని పదేపదే చెబుతున్న చంద్రబాబు.. కడపలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు మార్చారు. ఇందులో ఆంతర్యమేమిటని ముస్లిం మైనార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కడపకు ఉర్దూ వర్సిటీని కేటాయించిన సందర్భంలో ఉర్దూ భాషాభిమానులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు ఉర్దూ యూనివర్శిటీని మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో యోగి వేమన, ట్రిపుల్ ఐటీ, జేఎన్టీయూ లాంటి ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యను అందించే యూనివర్సిటీ జాబితాలో ఒకటిగా నిలువాల్సిన ఉర్దూ యూనివర్సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం పెద్దపీట వేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని ఆశలు కల్పించి అంతలోనే నీళ్లు చల్లడంపై అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా వైఎస్సార్ జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో కడపతోపాటు రాయచోటి, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం తదితర ప్రాంతాలలో లక్షలాది సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్ అవసరాలను పరిశీలిస్తే కచ్చితంగా కడపలో ఉర్దూ యూనివర్సిటీ అవసరమేనని ముస్లింలు ఖరాఖండిగా పేర్కొంటున్నారు. ఇంటర్ వరకే ఉర్దూ మీడియం కళాశాలలు జిల్లాలో అక్కడక్కడ ఉర్దూ భాషకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలున్నా కళాశాలలు ఇంటర్ స్థాయిలోనే ఆగిపోయాయి. కనీసం ఉర్దూ భాషకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలన్నా కూడా ఇక్కడ సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. డిగ్రీ స్థాయిలో ఉర్దూభాష చదువుకోవాలంటే తిరుపతి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కడపలో యూనివర్సిటీ స్థాయి విద్య సౌలభ్యం ఉంటే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు చదువుకొనే అవకాశం ఉంటుంది. రైల్వేకోడూరు బహిరంగసభలో చంద్రబాబు కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పలుచోట్ల టీడీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇపుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో వారు సందిగ్ధంలో పడ్డారు. కొనసాగుతున్న ఆందోళనలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పకుండా వేరే జిల్లాకు తన్నుకుపోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా కడప కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరింత ఉధృతం చేసే దిశగా ముస్లిం మైనార్టీ వర్గాలు వ్యూహం రూపొందించుకున్నాయి. కడప ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడపలో ఉర్దూ యూనివర్శిటీ నెలకొల్పాలి రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ప్రధాన కేంద్రం కడప. కాబట్టి ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పాలి. శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా...13 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ అందులో భాగంగా ఉక్కు కర్మాగారం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఉర్దూ యూనివర్శిటీ, టెక్స్టైల్స్ పార్కు, స్మార్ట్ సిటీలు కడపలో నిర్మిస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. కడపలో ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం సరికాదు. మాటమార్చే వారిని దేశం నుంచి బహిష్కరించాలి. మొదట కడప అన్నారు.. తర్వాత కర్నూలు అన్నారు.. రానున్న రోజుల్లో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు రగిలిందని సాకు చూపి.. తన పార్టీ ఫైనాన్షియర్ల ప్రాంతమైన గుంటూరు జిల్లాకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కడపలో యూనివర్సిటీ స్థాపించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. - ఎస్బీ అంజాద్బాష, వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు, కడప. జిల్లా పట్ల వివక్ష చూపడం తగదు అభివృద్దిని విస్మరిస్తున్న బాబు జిల్లాకు వచ్చిన పరిశ్రమలను, విద్యా సంస్థలను తరలించడం తగదు. వివక్ష చూపలేదంటూనే వచ్చిన వాటిని తన్నుకుపోతున్నారు. ఇక ఇంతకంటే వివక్ష ఏముంటుంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకుని కడపలోనే ఉర్దూ యూనివ ర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. - టీకే అఫ్జల్ఖాన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఉర్దూతో భవిష్యత్ తరాలకు మంచి రోజులు తెలుగు భాషలో ఎంతటి తియ్యదనం ఉందో ఉర్దూ భాషలో కూడా అంతటి తియ్యనైన కమ్మదనం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ జిల్లాలో నెలకొల్పడం ద్వారా ఒక మంచి వాతావరణం, సంసృ్కతి ఏర్పడుతుంది. కడప పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు ప్రభావం ఉంది. యూనివర్సిటీ వస్తే ఒక మంచి భావన ఏర్పడే అవకాశం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ కోసం ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజలు కలిసి రావాలి. - హఫీజుల్లా (కాల్టెక్స్), వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మాట తప్పడం తగదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇతర మంత్రులు కూడా అదే హామీ ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మైనార్టీలతోపాటు అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మైనార్టీ వర్గాల్లోనైతే ఎంతో సంతోషం నెలకొంది. ఇంతలోనే కర్నూలులో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడం దారుణం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట తప్పడం తగదు. - సయ్యద్ సలావుద్దీన్, ఉర్దూ యూనివర్శిటీ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇతర జిల్లాలకు తరలిస్తే సహించేది లేదు ఉర్దూ యూనివర్సిటీని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని గొప్పగా హామి ఇచ్చి ఇప్పుడేమో కర్నూలు, గుంటూరులో ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు గుప్పించడం ఏమాత్రం తగదు. ముందు ఒకమాట, మళ్లీ ఒకమాట ఇలా పూటకోమాట మాట్లాడటం సీఎం చంద్రబాబుకు తగదు. ఉర్దూ యూనివర్సిటీ వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందే. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు -
రెండో సారీ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు జిల్లాపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. గతంలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటును జిల్లా నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు మళ్లించిన ప్రభుత్వం... తాజాగా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) విషయంలోనూ చేయీచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ట్రిపుల్ ఐటీని పశ్చిమగోదావరి జిల్లాకు మళ్లించింది. ఇందుకు కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేవనే కారణాన్ని చూపుతోండటం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, దీనిని మంగళగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం మీద రాజధాని ఏర్పాటు విషయం మొదలు అన్నీ విషయాల్లోనూ రాష్ర్ట ప్రభుత్వం కర్నూలు జిల్లాపై నిర్లక్ష్యాన్ని చూపుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసి చేతులు దులుపుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తామని ప్రకటించాయి. జిల్లాలోనే ఏర్పాటు చేయాల్సిందే...! జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఐజయ్య డిమాండ్ చేశారు. జిల్లాలోనే ఏర్పాటయ్యే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. జిల్లాకు చెందిన పత్తికొండ ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రిగా ఉన్నా లాభం లేకుండా ఉందని, జిల్లా నుంచి అన్నీ తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రికి ఎంపీ బుట్టా రేణుక గురువారం లేఖ రాశారు. జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీని ఇక్కడే ఉంచి... పశ్చిమగోదావరి జిల్లాలో మరొకటి ఏర్పాటు చేసుకోవాలని సీఎంకు లేఖ రాయనున్నట్టు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ముందు కర్నూలు జిల్లాకు అని ప్రకటించి.. తర్వాత ఇతర జిల్లాలకు ప్రభుత్వం తరలిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మండిపడ్డారు. అభివృద్ధిని మళ్లీ ఒకే చోట కేంద్రీకరిస్తోందని.. రాజధాని నిర్మాణంతో సహా ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు అన్నారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే త్వరలో ప్రాంతీయ ఉద్యమాలు రావడానికి చంద్రబాబు ఇప్పుడే బీజం వేసిన వారవుతారని విమర్శించారు. జిల్లాపై వివక్ష చూపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్. రాకేష్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ తరలింపును వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు జి. చంద్రశేఖర్, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి శ్రీధర్ ప్రకటించారు. యువత ఆశలపై నీళ్లు..! జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం వీరిద్దరూ సాంకేతిక విద్యాశాఖ అధికారులతో కలిసి స్వయంగా వెళ్లి మరీ స్థలాన్ని చూపించారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు అవసరమైన భూమితో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రమకోర్చారు. ఇదే నమ్మకంతోనే.. కొద్దిరోజుల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీలో తరగతులు ప్రారంభమవుతాయని కూడా ప్రకటించారు. అయితే, ఇందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారి శ్రమ కాస్తా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. వాస్తవానికి జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైతే ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు పోవాల్సిన ఇబ్బందుల నుంచి విద్యార్థులకు ఊరట లభించేది. అంతేకాకుండా మన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ల ద్వారా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉండేది. అయితే, తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని యువత ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.