సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు జిల్లాపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. గతంలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటును జిల్లా నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు మళ్లించిన ప్రభుత్వం... తాజాగా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) విషయంలోనూ చేయీచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ట్రిపుల్ ఐటీని పశ్చిమగోదావరి జిల్లాకు మళ్లించింది. ఇందుకు కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేవనే కారణాన్ని చూపుతోండటం గమనార్హం.
అదేవిధంగా జిల్లాలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే, దీనిని మంగళగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తం మీద రాజధాని ఏర్పాటు విషయం మొదలు అన్నీ విషయాల్లోనూ రాష్ర్ట ప్రభుత్వం కర్నూలు జిల్లాపై నిర్లక్ష్యాన్ని చూపుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసి చేతులు దులుపుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసే వరకూ ఉద్యమిస్తామని ప్రకటించాయి.
జిల్లాలోనే ఏర్పాటు చేయాల్సిందే...!
జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, ఐజయ్య డిమాండ్ చేశారు. జిల్లాలోనే ఏర్పాటయ్యే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు.
జిల్లాకు చెందిన పత్తికొండ ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రిగా ఉన్నా లాభం లేకుండా ఉందని, జిల్లా నుంచి అన్నీ తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రికి ఎంపీ బుట్టా రేణుక గురువారం లేఖ రాశారు. జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీని ఇక్కడే ఉంచి... పశ్చిమగోదావరి జిల్లాలో మరొకటి ఏర్పాటు చేసుకోవాలని సీఎంకు లేఖ రాయనున్నట్టు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ముందు కర్నూలు జిల్లాకు అని ప్రకటించి.. తర్వాత ఇతర జిల్లాలకు ప్రభుత్వం తరలిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మండిపడ్డారు. అభివృద్ధిని మళ్లీ ఒకే చోట కేంద్రీకరిస్తోందని.. రాజధాని నిర్మాణంతో సహా ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు అన్నారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే త్వరలో ప్రాంతీయ ఉద్యమాలు రావడానికి చంద్రబాబు ఇప్పుడే బీజం వేసిన వారవుతారని విమర్శించారు.
జిల్లాపై వివక్ష చూపడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్ విద్యార్థి సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్. రాకేష్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలోనే ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ తరలింపును వ్యతిరేకిస్తున్నామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు జి. చంద్రశేఖర్, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి శ్రీధర్ ప్రకటించారు.
యువత ఆశలపై నీళ్లు..!
జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇందుకోసం వీరిద్దరూ సాంకేతిక విద్యాశాఖ అధికారులతో కలిసి స్వయంగా వెళ్లి మరీ స్థలాన్ని చూపించారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు అవసరమైన భూమితో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రమకోర్చారు. ఇదే నమ్మకంతోనే.. కొద్దిరోజుల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీలో తరగతులు ప్రారంభమవుతాయని కూడా ప్రకటించారు.
అయితే, ఇందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారి శ్రమ కాస్తా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. వాస్తవానికి జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైతే ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు పోవాల్సిన ఇబ్బందుల నుంచి విద్యార్థులకు ఊరట లభించేది. అంతేకాకుండా మన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ల ద్వారా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉండేది. అయితే, తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని యువత ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.
రెండో సారీ!
Published Fri, Dec 12 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement
Advertisement