వివక్షకు సాక్ష్యమిదే ! | discrimination! | Sakshi
Sakshi News home page

వివక్షకు సాక్ష్యమిదే !

Published Wed, Mar 4 2015 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

discrimination!

‘కడపలో ఉర్దూ భాషాభిమానులు అధికంగా ఉన్నారు. పైగా జిల్లాలోని రాయచోటి, కడపతోపాటు పలు ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంది. వారి పిల్లల చదువు కోసం, ఉపాధి రీత్యా ఉర్దూ భాషను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి ప్రజలు టీడీపీకి పెద్దగా ఓట్లు వేయకపోయినా కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’  
 - 2014 నవంబరు 8న రైల్వేకోడూరులో సీఎం హామి
 
 కడప జిల్లా ప్రజలు టీడీపీపై వివక్ష చూపినా మేము మాత్రం ప్రత్యేకంగా అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల ఉన్నత చదువుల కోసం ఉర్దూ యూనివర్సిటీని కడపలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మేమెక్కడా కూడా కడపపై వివక్ష చూపలేదు.  
 -  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వ్యాఖ్య.
 
 సాక్షి, కడప : కడప ప్రజలపై తాము ఏమాత్రం వివక్ష చూపక పోయినా ప్రతిపక్షం గోల చేస్తోందని పదేపదే చెబుతున్న చంద్రబాబు.. కడపలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు మార్చారు. ఇందులో ఆంతర్యమేమిటని ముస్లిం మైనార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కడపకు ఉర్దూ వర్సిటీని కేటాయించిన సందర్భంలో ఉర్దూ భాషాభిమానులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు ఉర్దూ యూనివర్శిటీని మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
 జిల్లాలో యోగి వేమన, ట్రిపుల్ ఐటీ, జేఎన్‌టీయూ లాంటి ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యను అందించే యూనివర్సిటీ జాబితాలో ఒకటిగా నిలువాల్సిన ఉర్దూ యూనివర్సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం పెద్దపీట వేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని ఆశలు కల్పించి అంతలోనే నీళ్లు చల్లడంపై అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా వైఎస్సార్ జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో కడపతోపాటు రాయచోటి, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం తదితర ప్రాంతాలలో లక్షలాది సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్ అవసరాలను పరిశీలిస్తే కచ్చితంగా కడపలో ఉర్దూ యూనివర్సిటీ అవసరమేనని ముస్లింలు ఖరాఖండిగా పేర్కొంటున్నారు.
 
 ఇంటర్ వరకే ఉర్దూ మీడియం కళాశాలలు
 జిల్లాలో అక్కడక్కడ ఉర్దూ భాషకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలున్నా కళాశాలలు ఇంటర్ స్థాయిలోనే ఆగిపోయాయి. కనీసం ఉర్దూ భాషకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలన్నా కూడా ఇక్కడ సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. డిగ్రీ స్థాయిలో ఉర్దూభాష చదువుకోవాలంటే తిరుపతి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కడపలో యూనివర్సిటీ స్థాయి విద్య సౌలభ్యం ఉంటే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు చదువుకొనే అవకాశం ఉంటుంది. రైల్వేకోడూరు బహిరంగసభలో చంద్రబాబు కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పలుచోట్ల టీడీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇపుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో వారు సందిగ్ధంలో పడ్డారు.
 
 కొనసాగుతున్న ఆందోళనలు
 జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పకుండా వేరే జిల్లాకు తన్నుకుపోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా కడప కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరింత ఉధృతం చేసే దిశగా ముస్లిం మైనార్టీ వర్గాలు వ్యూహం రూపొందించుకున్నాయి. కడప ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  
 కడపలో ఉర్దూ యూనివర్శిటీ నెలకొల్పాలి
 రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ప్రధాన కేంద్రం కడప. కాబట్టి ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పాలి. శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా...13 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ అందులో భాగంగా ఉక్కు కర్మాగారం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఉర్దూ యూనివర్శిటీ, టెక్స్‌టైల్స్ పార్కు, స్మార్ట్ సిటీలు కడపలో నిర్మిస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. కడపలో ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం సరికాదు. మాటమార్చే వారిని దేశం నుంచి బహిష్కరించాలి. మొదట కడప అన్నారు.. తర్వాత కర్నూలు అన్నారు.. రానున్న రోజుల్లో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు రగిలిందని సాకు చూపి.. తన పార్టీ ఫైనాన్షియర్ల ప్రాంతమైన గుంటూరు జిల్లాకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కడపలో యూనివర్సిటీ స్థాపించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
 - ఎస్‌బీ అంజాద్‌బాష, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు, కడప.
 
 జిల్లా పట్ల వివక్ష చూపడం తగదు
 అభివృద్దిని విస్మరిస్తున్న బాబు జిల్లాకు వచ్చిన పరిశ్రమలను, విద్యా సంస్థలను తరలించడం తగదు. వివక్ష చూపలేదంటూనే వచ్చిన వాటిని తన్నుకుపోతున్నారు. ఇక ఇంతకంటే వివక్ష ఏముంటుంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకుని కడపలోనే ఉర్దూ యూనివ ర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
 - టీకే అఫ్జల్‌ఖాన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి
 
 ఉర్దూతో భవిష్యత్ తరాలకు
 మంచి రోజులు
  తెలుగు భాషలో ఎంతటి తియ్యదనం ఉందో ఉర్దూ భాషలో కూడా అంతటి తియ్యనైన కమ్మదనం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ జిల్లాలో నెలకొల్పడం ద్వారా ఒక మంచి వాతావరణం, సంసృ్కతి ఏర్పడుతుంది. కడప పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు ప్రభావం ఉంది. యూనివర్సిటీ వస్తే ఒక మంచి భావన ఏర్పడే అవకాశం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ కోసం ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజలు కలిసి రావాలి.
 - హఫీజుల్లా (కాల్‌టెక్స్),
 
  వైఎస్సార్ సీపీ
 రాష్ట్ర మైనార్టీ నాయకుడు
 ముఖ్యమంత్రి మాట తప్పడం తగదు
 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇతర మంత్రులు కూడా అదే హామీ ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మైనార్టీలతోపాటు అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మైనార్టీ వర్గాల్లోనైతే ఎంతో సంతోషం నెలకొంది. ఇంతలోనే కర్నూలులో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడం దారుణం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట తప్పడం తగదు.
 - సయ్యద్ సలావుద్దీన్, ఉర్దూ యూనివర్శిటీ యాక్షన్ కమిటీ చైర్మన్
 
 ఇతర జిల్లాలకు తరలిస్తే సహించేది లేదు
 ఉర్దూ యూనివర్సిటీని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని గొప్పగా హామి ఇచ్చి ఇప్పుడేమో కర్నూలు, గుంటూరులో ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు గుప్పించడం ఏమాత్రం తగదు. ముందు ఒకమాట, మళ్లీ ఒకమాట ఇలా పూటకోమాట మాట్లాడటం సీఎం చంద్రబాబుకు తగదు. ఉర్దూ యూనివర్సిటీ వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందే. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం.
 - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement