కెర్బర్కే కిరీటం
యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జర్మనీ స్టార్
ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాపై విజయం
రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ఆద్యంతం నిలకడగా రాణిస్తే అనుకున్న ఫలితం సాధించడం కష్టమేమీ కాదని జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్ నిరూపించింది. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకుంది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన ఈ రెండో సీడ్ క్రీడాకారిణికి ఫైనల్లో మాత్రం గట్టిపోటీనే ఎదురైంది. అయితే క్లిష్ట సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన కెర్బర్ యూఎస్ ఓపెన్ కిరీటాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎంజెలిక్ కెర్బర్ తన కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి, వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచి, రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ జర్మనీ స్టార్ యూఎస్ ఓపెన్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రెండో సీడ్ కెర్బర్ 6-3, 4-6, 6-4తో పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. విజేతగా నిలిచిన 28 ఏళ్ల కెర్బర్‌కు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సోమవారం విడుదలయ్యే మహిళల టెన్నిస్ సంఘం తాజా ర్యాంకింగ్స్‌లో కెర్బర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంటుంది. ప్లిస్కోవా 11 నుంచి ఆరో ర్యాంక్‌కు ఎగబాకుతుంది.
బ్రేక్‌తో మొదలు...
విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న 24 ఏళ్ల ప్లిస్కోవా ఈ కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైంది. కెర్బర్ తొలి గేమ్‌లోనే ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కెర్బర్ శక్తివంతమైన రిటర్న్ షాట్లు సంధించగా... ప్లిస్కోవా పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్లో ఏకంగా 17 అనవసర తప్పిదాలు చేసిన ప్లిస్కోవా రెండో సెట్లో మాత్రం తేరుకుంది. ఏడో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ప్లిస్కోవా తన జోరు కొనసాగించింది. రెండో గేమ్‌లో కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని 3-1తో ముందంజ వేసింది. అయితే గతంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన అనుభవంలేని ప్లిస్కోవా కీలకదశలో తడబడింది. ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ స్కోరును 3-3తో సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో మరోసారి ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ విజయాన్ని ఖాయం చేసుకుంది.
4 యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాలుగో ఎడంచేతి వాటం క్రీడాకారిణి కెర్బర్. గతంలో ఎవ్లీన్ సియర్స్ (1907), మార్టినా నవ్రతిలోవా (1983, 84, 86, 87), మోనికా సెలెస్ (1991, 92) మాత్రమే ఈ ఘనత సాధించారు.
4 ఓపెన్ శకంలో (1968 నుంచి) తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, అదే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్. గతంలో గూలగాంగ్ కావ్లీ (1971), స్టెఫీ గ్రాఫ్ (1987), మార్టినా హింగిస్ (1997) ఈ ఘనత వహించారు.
4 పదేళ్లలో సెరెనా, అమెలీ మౌరెస్మో, జస్టిన్ హెనిన్ తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాలుగో క్రీడాకారిణి కెర్బర్.