వంద చిత్రాల ఆకాంక్ష నెరవేరకుండానే..
సాక్షి, హైదరాబాద్: రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌తో తెలుగు చలనచిత్ర పరిశ్రమపైనా తన ముద్ర వేశారు. ఈ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ (1984)’. జంధ్యాల దర్శకత్వంలో.. వీకే నరేశ్, పూరి్ణమ నటించిన ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ‘మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, నువ్వే కావాలి, నిన్ను చూడాలని.., చిత్రం, ఆనందం, ఇష్టం, నచ్చావులే’వంటి పలు సినిమాలు నిర్మించారు. వివిధ భాషల్లో కలిపి దాదాపు 80 సినిమాలు నిర్మించారు రామోజీరావు. మయూరి పేరిట ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించి.. పలు చిత్రాలను పంపిణీ చేశారు. రామోజీరావు ఓ సినిమాలో నటించారు కూడా. యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచి్చన ‘మార్పు’ సినిమాలో అతిథి పాత్ర పోషించారు. రామోజీరావు నిర్మించిన చివరి చిత్రం ‘దాగుడుమూత దండాకోర్ (2015)’. అంతకు ముందు కొన్ని చిత్రాలు అపజయం కావడంతో ఉషాకిరణ్ మూవీస్‌లో సినిమాల నిర్మాణానికి గ్యాప్ వచ్చింది. 2019లో మళ్లీ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కొందరు యువ దర్శకులను సంప్రదించి, కథలు తయారు చేయించారని, పలువురికి అడ్వాన్సులు కూడా ఇచి్చనట్టు వినిపించింది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో బ్రేక్ పడింది. రామోజీరావుకు వంద చిత్రాలు నిర్మించాలనే ఆకాంక్ష ఉండేదని సన్నిహితులు చెప్తుంటారు. అది నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. జూ.ఎన్టీఆర్ తొలి చిత్రం ఉషాకిరణ్‌లోనే.. రామోజీరావు ఎందరో నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’(2001) మూవీ ద్వారా పరిచయం చేసింది ఉషాకిరణ్ సంస్థనే. అలాగే ‘చిత్రం’సినిమా ద్వారా ఉదయ్‌కిరణ్, రీమాసేన్లను హీరో హీరోయిన్లుగా, ఇదే సినిమాతో నటుడు ‘చిత్రం’ శ్రీనును, దర్శకుడు తేజను పరిచయం చేశారు.‘నువ్వే కావాలి’తో హీరోగా తరుణ్, హీరోయిన్గా రిచా, ఓ కీలక పాత్రలో సాయికిరణ్‌లను.. ‘పీపుల్స్ ఎన్కౌంటర్స్’ద్వారా శ్రీకాంత్‌ను.. ‘ఇష్టం’చిత్రంతో కథానాయికగా శ్రియను.. ఇలా మరికొందరు నటీనటులను పరిచయం చేశారు. హిందీలో ‘తుజే మేరీ కసమ్’ద్వారా రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఎంఎం కీరవాణిని ‘మనసు మమత’చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం చేసింది ఉషాకిరణ్ మూవీస్ సంస్థనే.ఇతర భాషల్లోనూ.. రామోజీరావు తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో కలిపి దాదాపు 80కిపైగా సినిమాలను నిర్మించారు. హిందీలో నేరుగా ఓ సినిమా నిర్మించగా.. మూడు రీమేక్‌లు ఉన్నాయి. రామోజీరావు హిందీలో నిర్మించిన తొలి రీమేక్ ‘నాచే మయూరి’(1986). తెలుగులో ‘మయూరి’. క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్ర బయోపిక్‌గా ఆ మూవీ రూపొందింది.తర్వాత విజయశాంతి లీడ్ రోల్లో టి.కృష్ణ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘ప్రతిఘటన’సూపర్ హిట్ కావడంతో దానిని హిందీలో ‘ప్రతిఘట్’(1987) పేరుతో రీమేక్ చేశారు. అలాగే తెలుగు సూపర్ హిట్ మూవీ ‘నువ్వే కావాలి’ని ‘తుజే మేరీ కసమ్’ (2003) పేరిట హిందీలో రీమేక్ చేశారు. రామోజీరావు నేరుగా నిర్మించిన హిందీ చిత్రం ‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’(2004). ఆ చిత్రంలో ఆర్య బబ్బర్, శ్రియ శరణ్ జోడీగా నటించారు.