‘అసెంబ్లీలో ఎమ్మెల్యేల విజిల్స్’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించాయని మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున విపక్ష ఎమ్మెల్యేలు ప్రవరించిన తీరు నిరాశ కలిగించిందని మంత్రి శ్రీకాంత్ శర్మ అన్నారు. గవర్నర్ రామ్ నాయక్ ప్రసంగిస్తుండగా ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు గందరగోళం సృష్టించారు. గవర్నర్‌పైకి పేపర్లు విసిరి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
‘సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన అవమానకరంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు నిర్విరామంగా ఈలలు వేశారు. విపక్ష సభ్యుల వైఖరి యూపీ ప్రజలను అవమానించేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఆధ్వరంలో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడం అత్యంత దురదృష్టకరం. సోషలిస్ట్ సిద్ధాంతకర్త రామ్మనోహర్ లోహియా బతికివుంటే అసెంబ్లీలో ఈరోజు ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు చూసి కన్నీళ్లు పెట్టుకునివుండేవార’ని శ్రీకాంత్ శర్మ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈవిధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గబోదని స్పష్టం చేశారు.